సినీనటి హేమకు అదృష్టం అడ్డదారిలో కలిసి వచ్చింది. బెంగుళూరు రేవ్ పార్టీలో అడ్డంగా బుక్ అయిన హేమ తప్పించుకునేందుకు చాలా ప్రయత్నం చేశారు . అన్ని దారులు మూసుకుపోయాక… ఆమెను అరెస్టు చేశారు ఇక్కడే కొత్త ట్విస్ట్ కనిపిస్తోంది. నిజానికి మామూలు రోజుల్లో హేమ అరెస్టు అయినట్లయితే ఆమె గురించి రెండు రోజులు పాటు టీవీ చానల్స్ మోత ఎక్కించి ఉండేవి. సరిగ్గా ఎన్నికల ఫలితాలు ముందు రోజు అరెస్టు కావడంతో ఆ విషయం పెద్దగా పట్టించుకునే వారు లేక పోయారు. ఇంతకీ అసలు ఏం జరిగింది ఒకసారి చూద్దాం.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్ట్ అయ్యారు. గత నెలలో కర్ణాటక బెంగళూరులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీని అక్కడి పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా నటి హేమను తమ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. ఆమె హాజరు కాకపోవడంతో సోమవారం హైదరాబాద్ కు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
మే 27న రావాలని తొలుత నోటీసులు ఇవ్వగా, తనకు జ్వరం కారణంగా రాలేకపోతున్నానని, వారం రోజుల గడువు కావాలంటూ ఆమె కోరారు. దాంతో జూన్ 1న విచారణకు రావాలంటూ మరోసారి నోటీసులు జారీ చేశారు. అప్పుడూ డుమ్మా కొట్టడంతో తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చి, విచారణ అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు. మంగళవారం హేమను కోర్టులో హాజరుపర్చనున్నారు పోలీసులు.
బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇదే పార్టీకి వచ్చిన ఓ కారులో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన స్టిక్కర్ కూడా దొరికింది. పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. 86 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) అధికారులు వెల్లడించారు. 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి వైద్య పరీక్షలో డ్రగ్ పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు.
రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులతో పాటు సినీ నటి హేమ కూడా విచారణకు హాజరు కావాలని సీసీబీ పోలీసులు గత నెల 25న నోటీసులు జారీ చేశారు. అయితే తనకు వైరల్ ఫీవర్ వచ్చిందని, విచారణకు హాజరు కాలేనంటూ హేమ బెంగళూరు పోలీసులకు లేఖ రాశారు. విచారణకు హాజరు కావడానికి ఇంకాస్త సమయం కావాలని కోరారు. అయితే హేమ అభ్యర్థనను సీసీబీ పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదు.
రేవ్ పార్టీ విషయం బయటకు రాగానే తాను హైదరాబాద్ లో ఉన్నట్లు హేమ కవర్ చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. అయితే హేమ ఫొటోను పోలీసులు విడుదల చేశారు. రేవ్ పార్టీలో ఆమె ఉన్నారని, హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పరీక్షలు నిర్థారణ అయిందని పోలీసులు తెలిపారు.
మొత్తం మీద సినీ నటి హేమకి అదృష్టం అడ్డదారిలో కలిసి వచ్చినట్లు అయింది