కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఏఐసీసీ ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ నిన్న బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి సమక్షంలో రాష్ట్ర బీజేపీ ఇంఛార్జి తరుణ్ ఛుగ్ ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలతో మనస్తాపం చెందిన శ్రవణ్.. శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణ అభివృద్ధి చెందాలంటే అధికార మార్పు అవసరమని, తెలంగాణలో చికోటి ప్రవీణ్ లాంటి వారు ఎందరో ఉన్నారని ఆరోపించారు. చికోటి వెనక ఉన్నది మొత్తం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులేనని దాసోజు శ్రవణ్ ఆరోపణ చేశారు. రాష్ట్రంలోని 12 వేల పల్లెల్లో ఒక్కో పల్లెలో 8 నుంచి 12 వరకు బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి తాగుబోతుల తెలంగాణగా మార్చేసిందని శ్రవణ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజల రక్తాన్ని జలగలా పీల్చి ఖజానా నింపుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, నాయకులు విచ్చలవిడి అవినీతికి పాల్పడుతూ కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులు సంపాదించుకున్నారని ఆగ్రహం వ్యక్తపరిచారు. 35 వేల కోట్లతో పూర్తికావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును 1.50 లక్ష కోట్లకు పెంచి కాళేశ్వరం ప్రాజెక్టును కమీషనేశ్వర ప్రాజెక్టుగా మార్చారని ధ్వజమెత్తారు.
ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్తానని పేర్కొన్నారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేశానని గుర్తుచేసుకున్న ఆయన.. ఇప్పుడు సొంతింటికే వచ్చి అనుభూతిని పొందుతున్నానన్నారు. తెలంగాణ కోసం లాఠీ దెబ్బలు తిన్నానని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడు దొరల పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు.