నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 (NFHS) ప్రకారం భారతదేశంలో టోటల్ ఫెర్టిలిటీ రేట్(TFR) జాతీయ స్థాయిలో 2.0 (ప్రతి స్త్రీకి 2.0 పిల్లలు)కి పడిపోయింది. ఈ TFR పిల్లల రీప్లేస్మెంట్ ఫెర్టిలిటీ థ్రెషోల్డ్ 2.1 కంటే కొంత తక్కువగా ఉంది. సర్వే ప్రకారం సగటున గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు మెట్రోపాలిటన్ ప్రాంతాల కంటే ఎక్కువ సంతానోత్పత్తి కలిగి ఉన్నారు.
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది మల్టీ-రౌండ్, లార్జ్ స్కేల్ సర్వే, దీన్ని భారతదేశం అంతటా గృహాల ప్రాతినిధ్య నమూనాలో నిర్వహిస్తారు. మొదటగా NFHS 1992-93లో జరిగింది, ఇందులో సిక్కిం మినహా అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అప్పటి నుంచి భారత్ అంతటా క్రమం తప్పకుండా ఇలాంటి సర్వేలు నిర్వహిస్తున్నారు.
ఐదవ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS-5) మార్చి 31, 2017 నాటికి, భారతదేశంలో ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాలు (UT), 707 జిల్లాల కోసం డెమోగ్రాఫిక్ హెల్త్, పోషకాహార డేటాను అందిస్తుంది. మొత్తం ఐదు NFHS సర్వేలు భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) పర్యవేక్షణలో నిర్వహించబడ్డాయి.
2019-21 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేల ప్రాథమిక లక్ష్యం… ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై అవసరమైన డేటాను అందించడం, అలాగే సంతానోత్పత్తి రేట్లు, శిశు మరణాలు, మాతా-శిశు ఆరోగ్యం వంటి అంశాల్లో ఎదురవుతున్న సమస్యలపై డేటాను అందించడం.
భారతదేశంలో TFR కాలక్రమేణా క్రమంగా తగ్గింది. 1992-93 లో 3.4 గా ఉండగా.. 2019-21లో 2.0కి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో, TFR 1992-93లో 3.7 మంది పిల్లల నుంచి 2019-21 నాటికి 2.1 పిల్లలకు పడిపోయింది. పట్టణ ప్రాంతాల్లోని మహిళలు తక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నారు.. 1992-93లో 2.7 మంది పిల్లలు ఉండగా 2019-21 నాటికి 1.6 మంది పిల్లలకు తగ్గారు.