అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నివాసంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు సోదాలు నిర్వహించారని ట్రంప్ నిన్న ఆరోపించారు. ఫ్లోరిడా నగరంలోని తన మార్-ఎ-లాగో ఎస్టేట్‌పై ఎఫ్‌బీఐ అధికారులు దాడి చేశారని ట్రంప్ చెప్పారు. ఏజెంట్లు తన సేఫ్ లోకి చొరబడ్డారని ట్రంప్ అన్నారు. ట్రంప్ ఇంట్లో ఉన్న రికార్డులను శోధించేందుకు ఎఫ్‌బీఐ దాడి చేసినట్లు భావిస్తున్నారు. ట్రంప్ వైట్ హౌస్ నుంచి ఫ్లోరిడా క్లబ్ కు తీసుకువచ్చిన పత్రాల పెట్టెలపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తుందని అధికారులు తెలిపారు. గత ఫిబ్రవరిలో ట్రంప్ ఫ్లోరిడా ఎస్టేట్ నుంచి 15 పెట్టెల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు నేషనల్ ఆర్కైవ్స్ పేర్కొంది. ఇందులో వాషింగ్టన్ పోస్ట్ నివేదించిన అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉన్నాయని, అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత వైట్‌హౌస్‌ను విడిచిపెట్టినప్పుడు ట్రంప్ వాటిని తనవెంట తీసుకెళ్లారని తెలిపింది. ఇందులో పత్రాలు, మెమెంటోలు, అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా ఉన్నాయి. చట్ట ప్రకారం ట్రంప్ అధ్యక్ష పదవి ముగిసే సమయానికి వాటిని అప్పగించాలి కానీ దానికి బదులుగా మార్-ఎ-లాగో రిసార్ట్‌లో పెట్టుకున్నారు.
వైట్ హౌస్ నుంచి ట్రంప్ బయటకు వచ్చినప్పటి నుంచి పామ్ బీచ్‌లోని తన క్లబ్‌ను ఇంటిగా మార్చుకున్నారు. ఫ్లోరిడా ఎస్టేట్‌కు సంబంధించిన రికార్డులను ట్రంప్ తొలగించడంపై జస్టిస్ డిపార్ట్మెంట్ దర్యాప్తు ప్రారంభించింది. ట్రంప్ కు చెందిన ఫ్లోరిడా ఇంటి నుంచి 15 బాక్స్‌ల వైట్ హౌస్ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.