రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుకు ఈరోజు ఎగువసభలో ప్రధాని నరేంద్రమోదీ వీడ్కోలు పలికారు. మోదీతో పాటు ఇతర అగ్రనేతలు కూడా వెంకయ్యకు వీడ్కోలు పలికారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10న పూర్తవుతుంది. ఈ సందర్బంగా తన వీడ్కోలు ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని.. సభకు ఇది చాలా ఉద్వేగభరితమైన క్షణం అని అన్నారు. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పదవీకాలం ముగింపు సందర్భంగా కృతజ్ఞతలు తెలిపేందుకు ఈరోజు మనమందరం ఇక్కడకు వచ్చాం. ఈ సభకు ఇది చాలా ఎమోషనల్ మూమెంట్. సభలోని అనేక చారిత్రాత్మక క్షణాలు మీ మనోహరమైన ఉనికితో ముడిపడి ఉన్నాయని రాజ్యసభలో మోదీ అన్నారు.
మాతృభాష వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నందుకు వెంకయ్యను ప్రధాని అభినందించారు. మాతృభాష కంటి చూపు లాంటిదని, రెండవ భాష కంటి అద్దాల వంటిదని మీరు అంటుంటారు.. అలాంటి అనుభూతి గుండె లోతుల్లోంచి బయటకు వస్తుంది.. మీ సమక్షంలో సభ జరిగే సమయంలో ప్రతి భారతీయ భాషకు ప్రత్యేక ప్రాధాన్యత లభించిందని మోదీ అన్నారు.
దేశ 14వ ఉపరాష్ట్రపతిగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్ఖర్ శనివారం ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వాపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుత వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10న ముగియనుండగా.. మరుసటి రోజు(ఆగస్టు 11)న ధంఖర్ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.