మునుగోడు ఎన్నికకు సంబంధించి ప్రచారానికి గడువు ముగిసింది. అయితే ఈ ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఓ సర్వే నిర్వహించిందని..అందులో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తోందని తేలిందంటూ ఓ వార్త సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఖండించింది ఆర్ఎస్ఎస్. సంస్థ ఎలాంటి సర్వే నిర్వహించలేదని… తమ సర్వే అంటూ ఓ అజ్ఞానవ్యక్తి సంతకం చేసిన ఆ పత్రం పూర్తిగా నకిలీదని స్పష్టం చేసింది. ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ్ కాచం రమేశ్ పేరుతో పత్రికాప్రకటన విడుదలైంది. ఆర్ఎస్ఎస్ వ్యక్తి నిర్మాణంద్వారా దేశవైభవాన్ని సాధించాలనే మౌలిక లక్ష్యంతో 97 ఏళ్లుగా పనిచేస్తున్న స్వచ్ఛందసంస్థ అని, ఆర్ఎస్ఎస్ సంస్థాగతంగా రాజకీయాలతో గానీ, రాజకీయ సర్వేలలో గానీ పాలుపంచుకోదని లేఖలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు కీలకమైన అంశం కనుక ప్రజలందరూ నిర్భయంగా, తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భారత ప్రజలందరినీ ఆర్ఎస్ఎస్ ప్రోత్సహిస్తుందని పత్రికా ప్రకటనలో రమేశ్ తెలిపారు.
“ఆర్ఎస్ఎస్ వంటి సాంస్కృతిక. స్వచ్ఛంద సంస్థపై ఇటీవల కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అసంబద్ధమైన, అసత్యమైన వార్తలు, కథనాలు, వ్యాఖ్యానాల ద్వారా అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేయడం అసమంజసం. ఈవిధంగా వ్యవహరించడం బాధ్యతాయుతమైన ఏసంస్థకు గానీ, వ్యక్తికి గానీ తగదు. ఇటువటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామిక విలువలను అగౌరవపరచడమే అవుతుంది. ఈ నకిలీ పత్రం ద్వారా జరుగుతున్న తప్పుడు వార్తలకు బాధ్యులైన వారిని గుర్తించి చట్టబద్దమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నాం’ అని ఆర్ఎస్ఎస్ పత్రికా ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.