దేశ చరిత్రలోనే తొలిసారి ఏకంగా 38 మంది దోషులకు ఉరిశిక్ష పడింది. సంచలనం రేపిన 2008నాటి అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో దోషులందరికీ శిక్ష విధిస్తూ గుజరాత్ లోని ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఆ ఏడాది జులై 26న అహ్మదాబాద్ లో పలుచోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 56 మంది చనిపోగా…200మందికిపైగా గాయపడ్డారు.
గంట వ్యవధిలో 21 చోట్ల వరుసగా బాంబు పేలుళ్లు సంభవించాయి. మరికొన్ని బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు. పేలుళ్లకు ఇండియన్ ముజాహిదీన్, హార్ఖత్ ఉల్ జిహాదీ అల్ ఇస్లామీ ఉగ్రవాద సంస్థలు కారణమని తేలింది. 2002 గోద్రా అనంతర అల్లర్లకు ప్రతీకారంగానే ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడినట్టు నిర్థారణ అయింది. అహ్మదాబాద్‌లో 20, సూరత్‌లో 15 కేసులు నమోదు కాగా..మొత్తం 35 కేసులను విలీనం చేసి విచారణ జరిపింది స్పెషల్ కోర్టు. విచారణతో మొత్తం 78 మందిని నిందితులుగా నిర్థారించారు. వారిలో ఒకరు అప్రూవర్ గా మారారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8న 49 మందిని దోషులుగా తేల్చిన గుజరాత్ కోర్టు…సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో 28మందిని నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేసింది.
ఒకే కేసులో ఇంత మందికి మరణశిక్ష విధించడం ఇదే మొదటిసారి. ఇదే కేసులో మరో 11 మందికి జీవిత ఖైదు పడింది. పెరోల్ కు అవకాశం లేకుండా తీర్పునిచ్చింది. నాటి పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలనీ కోర్టు ఆదేశించిందిం. తీవ్ర గాయలపాలైన వారికి 50 వేలు, స్వల్ప గాయాలైనవారికి 25 వేలు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)