అయోధ్య అంతా రామమయం అంటే ఇన్నాళ్లు పాటగానే విన్నాం. కానీ అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం చేపడుతుంటే.. అంతా రామమయం అన్న విషయం తెలుస్తోంది. సుప్రీం తీర్పు అనంతరం అక్కడ మందిర నిర్మాణం కోసం చేపడుతున్న తవ్వకాల్లో అనేక అవశేషాలు లభిస్తున్నాయి. అయోధ్య మందిరానికి సంబంధించిన ఆనవాళ్లతో పాటుగా.. ప్రాచీన వస్తువులు, విగ్రహాలు లభిస్తున్నాయి. తాజాగా మరికొన్ని విగ్రహాల ఆనవాళ్లు లభించాయి. రాముడి చరణ పాదుకలతో సహా అత్యంత ప్రాచీనమైన కొన్ని విగ్రహాల అవశేషాలు కూడా లభ్యమయ్యాయి. వీటిని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సురక్షితంగా భద్రపరచింది. అయితే వీటిని రామ మందిర నిర్మాణం అనంతరం ఇక్కడ నిర్మించబోయే మ్యూజియంలో భద్రపరుచనున్నారు.