బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తోంది. ఈ సినిమా విడుదలకు సెన్సార్ చిక్కు ముడులు తప్పేటట్లు లేవు. ఈ సినిమా విడుదల వ్యవహారం ప్రస్తుతం బొంబాయి హైకోర్టులో నడుస్తోంది.
పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమా ఒకప్పటి ఎమర్జెన్సీ పరిస్థితి మీద నిర్మించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1975లో విధించిన ‘అత్యవసర పరిస్థితి’(ఎమర్జెన్సీ) ని కళ్ళకు కడుతోంది. . ఈ సినిమాను స్వయంగా కంగనా రనౌత్ నిర్మాత, దర్శకత్వం వహించి నటించి తీసింది. ఈ సినిమాలో కంగనా రనౌత్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించింది. శిరోమణి అకాలీదళ్ సహా కొన్ని సిక్కు సంస్థలు ఈ సినిమా మీద ఆక్షేపణలు తెలిపాయి. తమ వర్గాన్ని ఈ సినిమాలో తప్పుగా చిత్రీకరించారని వారు అంటున్నారు.
దీంతో ఈ సినిమా మీద పీటముడి ఏర్పడింది.
ఈ సినిమాకు సర్టిఫికెట్ జారీ చేయకుండా సెన్సార్ బోర్డు నిలిపి ఉంచింది. దీంతో సినిమా నిర్మాతలు బొంబాయి హైకోర్టుని ఆశ్రయించారు.
ఈ సినిమాపై సెప్టెంబర్ 25లోగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు సిబిఎఫ్ సిని ఆదేశించింది.
సెన్సార్ బోర్డు తరఫున అభినవ్ చంద్రచూడ్, సినిమా నిర్మాతల తరఫున శరణ్ జగత్యానీ తమ వాదనలు చేశారు. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డు ఒక ప్రతిపాదనను కోర్టు ముందుకు తీసుకుని వచ్చింది. తాము కొన్ని కట్ లు సూచిస్తామని వాటిని తొలగించినట్లయితే సినిమా విడుదలకు సర్టిఫికెట్ జారీ చేస్తామని సెన్సార్ బోర్డు చెబుతోంది. దీని మీద నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని సినిమా నిర్మాతలు కోర్టుకి విన్నవించుకున్నారు.
ఈ సినిమా నిజానికి సెప్టెంబర్ 6న విడుదల కావలసింది. కానీ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ లభించనందున ఈ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. సెన్సార్ బోర్డు సూచించిన దృశ్యాలను తొలగించుకుని ఎమర్జెన్సీ సినిమా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.