తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఎనిమిదో రోజు యాత్ర ప్రారంభమయింది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని తేరు మైదాన్‌లో బీజేపీ గురువారం రాత్రి భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. వారం రోజులుగా కొనసాగుతోన్న ప్రజా పోరాట యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా అదే స్థాయిలో బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ సభను విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై హాజరుకానున్నారు. అలాగే హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు హాజరుకానున్నారు.
బీజేపీకి పెరుగుతున్న ఆదరణ, బండి సంజయ్, ఈటల రాజేందర్‌లకు అందరిలో ఆదరణ పెరగడం, అన్నింటికి మించి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అనుభవం కలిగిన డీకే అరుణ ఉన్నందున అందరి దృష్టి ఈ కార్యక్రమంపైనే ఉంది. బుధవారం తేరు మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను డీకే అరుణ, ప్రజా సంగ్రామ యాత్ర జోగులాంబ గద్వాల జిల్లా ఇన్ చార్జి వెంకట్ రెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి తదితరులు పరిశీలించారు.