మాధురి చెత్త పనులు.. తిరుమలలో మళ్లీ తప్పులు.. సోషల్ మీడియా సెలబ్రిటీల అపచారం
……………………………………….
దువ్వాడ మాధురి మరోసారి చెత్త పనులతో దొరికిపోయారు. తిరుమల కొండపై కేక్ కట్ చేసి, ఆ వేడుకలకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తిరుమలలో ప్రైవేటు వేడుకలు, వేడుకలకు సంబంధించిన ప్రచారాలు పూర్తిగా నిషేధం. అయినప్పటికీ, మాధురి సహా కొందరు సెలబ్రిటీలు ఇలాంటి చెత్త పనులు చేస్తూనే ఉన్నారు. ఈ చర్యలను టీటీడీ సీరియస్ గా తీసుకొంది. ………………………:
గతంలో కూడా దువ్వాడ మాధురి తిరుమల మాడ వీధుల్లో రీల్స్ రికార్డ్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఆ సమయంలో భక్తుల నుంచి, టీటీడీ అధికారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆమె క్షమాపణలు చెప్పారు. అయితే, ఆ ఘటన మరువకముందే మళ్లీ అదే తరహాలో ఆధ్యాత్మిక క్షేత్రాన్ని వ్యక్తిగత వేడుకలకు వేదిక గా మార్చుకొన్నారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసమే ఇలాంటి చెత్త పనులు చేస్తున్నారని తెలుస్తోంది.
……………………….
సాధారణ భక్తులు చిన్న తప్పు చేసినా కఠినంగా వ్యవహరించే అధికారులు, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తుల విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అపచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.
………………………….
తిరుమల అనేది కేవలం ఒక పర్యాటక కేంద్రం కాదు, అది కోట్ల మంది నమ్మకానికి ప్రతిరూపమైన పరమ పవిత్ర క్షేత్రం. సెలబ్రిటీలు లేదా రాజకీయ హోదా ఉన్న వ్యక్తులు తాము అందరికంటే అతీతులమని భావించడం తప్పు. సామాన్య భక్తులకు ఆదర్శంగా ఉండాల్సిన వారే నిబంధనలను ఉల్లంఘించడం అపచారం. హోదా ఏదైనా, దేవుడి సన్నిధిలో అందరూ సమానమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పవిత్రమైన కొండపై రీల్స్ చేయడం, వ్యక్తిగత వేడుకలు జరుపుకోవడం వంటి చర్యలు మానుకొని, క్షేత్ర మర్యాదను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.



