మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయిన వైసిపి పార్టీకి… నాయకుల వ్యవహార శైలి తలనొప్పి పుట్టిస్తోంది. ఆయా నాయకుల వ్యక్తిగత వివాదాలు ఇప్పుడు పార్టీ ప్రతిష్టకు మచ్చగా మారుతున్నాయి. తాజాగా వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి ఉత్తరాంధ్రలో రచ్చగా మారింది. భార్య కూతుళ్లను వదిలేసి వేరే మహిళతో ఆయన సహజీవనం చేస్తూ పబ్లిక్ గా దొరికిపోయారు. దీని మీద కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మండిపడుతుండగా దువ్వాడ శ్రీనివాస్ అడ్డం తిరిగారు. మొత్తం మీద రెండు రోజులుగా జరుగుతున్న ఎపిసోడ్ వైసిపి పార్టీ పేరు ని మురికి కాలువలో కలిపేసింది.
ఉత్తరాంధ్రలో చాలా స్వల్ప కాలంలో ఎదిగిన నాయకుడిగా దువ్వాడ శ్రీనివాస్ ని చెప్పవచ్చు. స్థానిక నాయకులతో సంబంధాలు లేకుండానే అధిష్టానం ఆశీస్సులతో ఆయన చకచకా ఎదిగారు. ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకొని భార్యకు జడ్పిటిసి అవకాశం కల్పించారు. నిజానికి దువ్వాడ శ్రీనివాస్ భార్య శ్రీవాణి రాజకీయ నాయకుల కుటుంబాన్నించి వచ్చారు. ఆమె తండ్రి తాత కూడా చాలా పేరున్న నాయకులు. ఈలోగా దువ్వాడ శ్రీనివాస్ కు మాధురి అనే ఆమె పరిచయం కావడం ఆమెతో వేరే కాపురం పెట్టేయడంతో గొడవలు శృతిమించాయి.
తాజాగా దువ్వాడ శ్రీనివాస్ ఇంటిదగ్గర జరిగిన ఎపిసోడ్ కుండ బద్దలు కొట్టింది. శుక్రవారం రాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఉద్రిక్తత కొనసాగింది. పెద్ద కుమార్తె హైందవితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ నూతనంగా నిర్మించిన ఇంటికి ఆయన సతీమణి దువ్వాడ వాణి వచ్చారు. ఇంటి గేట్లను బలవంతంగా తెరిచి వాణి, హైందవిలు లోనికి ప్రవేశించారు. బయట నుంచి వచ్చిన శ్రీనివాస్ ఒక్క సారిగా భార్యాకూతురిని చూసి చిందులు తొక్కారు.
భార్యా కూతురిని చంపేస్తాను అంటూ గ్రానైట్ రాయి పట్టుకుని వారిపైకి దూసుకెళ్లారు. పోలీసులు ఆయనను అదుపు చేశారు. ఈ క్రమంలోనే భార్యాకూతురితో దువ్వాడ వాగ్వాదానికి దిగారు.
న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదలబోమని ఇంటి లోపల వాణి, హైందవిలు బైఠాయించారు. ఈ సందర్భంగా
హైందవి మాట్లాడుతూ.. తన తండ్రిని కలిసేందుకు గురువారం అర్ధరాత్రి 2 గంటల వరకు వేచి ఉన్నప్పటికీ స్పందన లేదన్నారు. ఒక మహిళ కారణంగా తమ తండ్రి తమకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని వెల్లడించారు. వైసీపీ లో ఇటువంటి నాయకులను జగన్ పెంచి పోషిస్తున్నాడంటూ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని అక్కవరం గ్రామంలో జాతీయ రహదారిపై దువ్వాడ ఇటీవల కొత్తగా ఇంటిని నిర్మించుకున్నారు. దువ్వాడ ఆ ఇంట్లోనే ఉంటున్నారు. శ్రీనివాస్ ఇంటిదగ్గర ఉద్రిక్తత పెరగటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రెండు పక్షాలకు నచ్చచెప్పి పంపించేశారు.
ఈలోగా దువ్వాడ శ్రీనివాసు సన్నిహితురాలు మాధురి మాట్లాడుతూ.. కొంతకాలంగా శ్రీనివాస్ తో కలిసి ఉంటున్నట్లు వెల్లడించారు. ఆయన తనకు గురువు మార్గదర్శి అని అభివర్ణించారు. అటువంటి అప్పుడు తన పరిస్థితి ఏమిటి అని దువ్వాడ శ్రీనివాస్ భార్య శ్రీవాణి నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు కూతుర్లకు ఏమి సమాధానం చెబుతారు అని ఆమె నిలదీస్తున్నారు. ఈలోగా దువ్వాడ శ్రీనివాస్ పోలీసులను కలిసి భార్య కూతుళ్ళ మీద కేసు పెట్టించారు. ఇది మరింత వివాదాస్పదంగా మారింది..
మొత్తం మీద ఉత్తరాంధ్రలో దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ తో వైసిపి పార్టీకి చెడ్డ పేరు వచ్చింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. వైసీపీ పార్టీ నాయకులు అంతా పద్ధతిలేని వ్యక్తులు అన్న తరహాలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్లింగ్ నడుస్తోంది. దీనికి సమాధానం చెప్పలేక ఒకానొక దశలో వైసిపి సోషల్ మీడియా చేతులు ఎత్తేసి నట్టు గా పరిస్థితి తయారయింది.