తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీలో పనిచేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసింది. క్వాలిటీ కంట్రోల్ డీఈ బి. ఎలిజర్, బర్డ్ ఆస్పత్రి స్టాఫ్ నర్స్ ఎస్. రోసి, బర్డ్ ఆస్పత్రిలో పని చేస్తున్న ఫార్మసిస్ట్ ప్రేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో పని చేస్తున్న అసుంతలను సస్పెండ్ చేసింది. ఈ మేరకు వారిని విధుల నుంచి తొలగిస్తూ తాజాగా టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. వీరు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. టీటీడీ విజిలెన్స్ నివేదిక ఆధారంగా టీటీడీ ఈ చర్యలు చేపట్టింది. హిందూ ధార్మిక సంస్థలో ఉంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని చర్యలు చేపట్టింది. టీటీడీలో విధులు నిర్వహిస్తూ చర్చ్‌ల్లో ప్రార్థనలు చేస్తూ ఉద్యోగుల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చర్చ్‌లో ప్రార్థనలు చేస్తూ కెమెరా కంట చిక్కింది ఉద్యోగి కణిక. వీడియో తీస్తున్నట్లుగా గుర్తించి వెంటనే ముఖంపై పైట కప్పుకుంది. ఇలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తులు డిమాండ్ చేయగా తాజాగా టీటీడీ చర్యలు చేపట్టింది.