ఎన్నికళ వేళ.. చిక్కుల్లో కేరళ సీఎం పినరయ్ విజయన్..!
కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సీఎం పినరయ్ విజయన్‌కు పెద్ద చిక్కొచ్చిపడింది. తన సొంత అల్లుడితో పాటు.. మరో ఇద్దరి వ్యక్తులు జైలుపాలయ్యారు. 2009 లో చేపట్టిన ఓ ఆందోళన కేసులో సీఎం అల్లుడు మహ్మద్ రియాజ్‌తో పాటుగా మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు జైలుకు పంపారు. అయితే ఇదంతా బీజేపీ కుట్రపూరితంగా ఆడుతున్న గేమ్ అని సీపీఎం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పన్నెండేళ్ల క్రితం నాటి కేసును ఇప్పుడు తెరపైకి తీసుకురావడమేంటని ప్రశ్నిస్తున్నారు. సీఎం అల్లుడు మహ్మద్ రియాజ్‌తో పాటు.. మాజీ ఎమ్మెల్యే టీవీ రాజేశ్,డీవైఎఫ్ఐ నేత కేకే దినేష్‌లకు కోజికోడ్ కోర్టు పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు వీరిని జైలుకు పంపారు.
ఏం జరిగిందంటే..
2009లో సీపీఎం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. విమానాలను రద్దు చేయడంతో పాటు.. ఛార్జీలను అధికంగా పెంచారంటూ ఎయిర్ ఇండియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీపీఎం ఆందోళనలకు దిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సాగిన ఈ ఆందోళనలకు మహ్మద్ రియాజ్‌తో పాటు, మాజీ ఎమ్మెల్యే టీవీ రాజేశ్,కేకే దినేష్‌లను గుర్తించిన పోలీసులు వారిపై చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే వీరికి గతంలోనే బెయిల్ మంజూరు అయ్యింది. ప్రస్తుతం బెయిల్ గడువు ముగియడంతో పోలీసులు వీరిని మరోసారి కోజికోడ్ కోర్టులో హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో కోర్టు వీరికి పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అయితే వీరిలో టీవీ రాజేశ్ కన్నూర్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు.