తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ.. డీఎంకే పార్టీ సీనియర్ నేత ఇంట్లో సోదాలు టెన్షన్ వాతావరణాన్ని పుట్టిస్తున్నాయి. పార్టీకి చెందిన సీనియర్ నేత ఈవీ వేలూ ఇంట్లో గురువారం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం కూడా సోదాలు చేపడుతున్నట్లు ఐటీ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈవీ వేలూ ఇంటి నుంచి దాదాపు రూ.3.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల వేళ.. ఈవీ వేలూ ఇంటి నుంచి పెద్ద మొత్తంలో నగదు పంపిణీ జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో.. ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈవీ వేలూ సొంత ఊరితో పాటు చెన్నైలోని ఇంట్లో కూడా సోదాలు చేపడుతున్నారు. మొత్తం పది చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు కూడా ధృవీకరించారు.