తమిళనాడు రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అన్నాడీఎంకే ఎమ్మెల్యే పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు పుదుకోట జిల్లా అరంతాంగి నియోజకవర్గ ఎమ్మెల్యే రత్నసభాపతి ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కాగా, గతకొద్ది రోజులుగా ఆయన పార్టీతీరుపట్ల అసంతృప్తితో ఉన్నారు. ఇదే సమయంలో పార్టీ కూడా ఆయనకు టికెట్టు కేటాయించకపోవడంతో.. ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తదుపరి కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానని ఎమ్మెల్యే రత్నసభాపతి తెలిపారు.