ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము నామినేషన్ వేశారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ చీఫ్ నడ్డా, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్షా, బీజేపీ పాలితరాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నాయకుల సమక్షంలో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కాకపోయినా బీజేడీ, వైసీపీ ఇప్పటికే మద్దతు ప్రకటించిన సంగతితెలిసిందే. వైసీపీ తరపున విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి ముర్ము నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఉదయం ఒడిషాభవన్ నుంచి పార్లమెంట్ కు వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు ముర్ము. ఆమె పేరును మొదట నరేంద్రమోదీ ప్రతిపాదించారు. రాజ్ నాథ్ సింగ్ బలపరిచారు. తరువాత బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా 50మంది ఎలక్టోరల్ సభ్యులు ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ సంతకాలు చేశారు. తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే( AIADMK)నేత ఓ పన్నీర్ సెల్వం, ఎం.తంబి దొరై, జేడీ-యూ రాజీవ్ రంజన్ సింగ్ కూడా నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.
అటు తన నామినేషన్ కు ముందు ద్రౌపది సోనియాగాంధీకి, మమతా బెనర్జీకి, శరద్ పవార్ కు ఫోన్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఆ ముగ్గురు నేతలూ ముర్ముకు అభినందనలు తెలిపారు. జులై 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగనుంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవికాలం జులై 24, 2022న ముగియనుంది.