ఈ తరం యువత, విద్యార్థులకు సినిమా తారలు , క్రికెటర్ల పుట్టినరోజు, పెళ్లిరోజులు బాగా గుర్తుంటాయి. ఆయా సందర్భాలలో సెలబ్రేషన్స్ చేస్తూ సందడి కూడా చేస్తుంటారు. కానీ అంతకుమించి దేశం కోసం సర్వస్వం సమర్పణ చేసిన దేశభక్తులు, శాస్త్రవేత్తలను గుర్తించుకోవాలి. అటువంటి మహనీయులలో విక్రమ్ సారాభాయ్ ఒకరు.
దేశం గర్వించదగ్గ అద్భుత శాస్త్రవేత్త డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ శత జయంతి నేడు. ఆయన అంతరిక్ష రంగానికి చేసిన సేవలకుగానూ సెర్చ్ ఇంజిన్ గూగుల్ అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. భారత శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ స్పెషల్ డూడుల్తో ఆయన సేవల్ని మరోసారి మనకు గుర్తు చేసింది. గగనతలంపై భారత్ విజయాలు సాధిస్తుందంటే అందుకు మూలకారకులలో సారాభాయ్ ఒకరు. మరో సైంటిస్ట్ హోమీ బాబా సాయంతో తొలి రాకెట్ లాంచింగ్ స్టేషన్ను కేరళలోని తిరువనంతపురంలో నెలకొల్పారు. ఆయన కృషితోనే భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) ఏర్పాటై నేడు ప్రపంచ దేశాలకు తమ సత్తాను చాటుతోంది.
విక్రమ్ సారాభాయ్ జీవిత విశేషాలు చూద్దాం. 1919 ఆగస్టు 12వ తేదీన గుజరాత్లోని అహ్మదాబాద్లో విక్రమ్ సారాభాయ్ జన్మించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందిన తర్వాత దేశానికి ఏదైనా మేలు చేయాలని భావించారు. ఈ క్రమంలోనే వారి కుటుంబ ట్రస్టు సాయంతో కేవలం 28 ఏళ్ల వయసులో 1947 నవంబర్ 11 న అహ్మదాబాద్లో ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (పీఆర్ఎల్)ను ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్ ఐఐఎం ఏర్పాటు కూడా సారాభాయ్ పట్టుదలకు నిదర్శనం.
అప్పటికే అణు విజ్ఞాన శాస్త్ర వేత్త గా పేరు తెచ్చుకున్న డాక్టర్ హోమీ జహంగీర్ బాబా తోడ్పాటుతో విక్రమ్ సారాభాయ్ భారతదేశంలో మొట్టమొదటి రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని కేరళలోని తిరువనంతపురంలో ఏర్పాటు చేశారు. నవంబర్ 21, 1963న ఓ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. 1971లో డిసెంబర్ 30న విక్రమ్ సారాభాయ్ కన్నుమూశారు. భారత్ స్వయంగా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించాలన్న ఆయన ఆకాంక్ష, ఆలోచనలు 1975లో నెరవేరాయి. దేశ తొలి ఉపగ్రహం ఆర్యభట్టను రష్యా సాయంతో భారత్ ప్రయోగించించింది.
విక్రమ్ సారాభాయ్ ప్రయత్నాల వల్లనే పీ ఎస్ ఎల్ వీ వంటి అద్భుతం సాకారమైంది. భారతదేశపు ప్రముఖ రాకెట్ సైంటిస్ట్ అయిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాంకి విక్రమ్ సారాభాయ్ మార్గనిర్దేశకులు కూడా… ఇక విక్రం సారాభాయ్ సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం 1966లో పద్మ భూషణ్ ఇచ్చి సత్కరించింది. ఆయన మరణానంతం 1972లో పద్మ విభూషణ్ ప్రకటించిన సారాభాయ్ సేవలను స్మరించుకుంది. విక్రమ్ సారాభాయ్ గౌరవార్థం ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్ 2లోని ల్యాండర్కి విక్రమ్ అని పెరు పెట్టిన సంగతి తెలిసిందే.
ఇటువంటి మహనీయుల జీవితాలు, సేవలను నేటితరం యువత స్ఫూర్తిగా తీసుకోవాలి