ఎలోన్ మస్క్ కొంతకాలంగా వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్న దిగ్గజ వ్యాపారవేత్త. ఇటీవలే ట్విట్టర్ సొంతం చేసుకున్నారీ టెస్లా బాస్. ఇక ప్రతీ మగాడి విజయం వెనకా ఓ ఆడది ఉంటుంది అంటారు కదా. అలాగే మస్క్ వరుస విజయాల వెనక కూడా ఓ మహిళ ఉంది. ఆ మహిళ ఎవరో కాదు మస్క్ తల్లి మాయే మస్క్. ఇంత ఎదిగినా తన కొడుకును కనిపెట్టుకునే ఉంటుందామె. ఇంట్లోనే కాదు … పబ్లిక్ ఈవెంట్లలోనూ ఎలోన్ తో తప్పకుండా మాయే ఉంటారు.
ట్విట్టర్ ను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను బోర్టు ముందు పెట్టడం మొదలు, ట్విట్టర్ బోర్డ్ బిడ్ ను ఆమోదించడం వరకు అన్నివర్గాలనుంచి ఎన్నో రకాలైన దాడుల్ని ఎదుర్కొన్నాడు ఎలోన్. అతనికి బెదిరింపులు సైతం వచ్చాయి. వాటన్నింటిని తిప్పికొడుతూ కొడుక్కు అండగా నిలబడింది.
74 ఏళ్ల మాయే మస్క్ కెనడియన్-సౌతాఫ్రికా డైటీషియన్. మోడల్ కూడా. 50ఏళ్ల నుంచి ఆమె మోడలింగ్ చేస్తున్నారు. 21 సంవత్సరాల వయస్సులో మిస్ సౌత్ ఆఫ్రికా రన్నరప్ తను. ప్రజాజీవితంలో కొడుకుతో పాటే ఉండే మాయే సోషల్‌మీడియాలోనూ కొడుకుతోనే కనిపిస్తుంది. తన కొడుకు వ్యాపారాల గురించి, మీడియా నివేదికలను ఉటంకిస్తూ గర్వంగా షేర్ చేస్తుంటుంది. తన కొడుకును లక్ష్యంగా చేసుకున్నవారిపై విరుచుకుపడుతుంది. తప్పుడు రిపోర్టులతో టార్గెట్ చేసి వారిని ఏకీ పారేస్తుంటుంది.
ఇటీవల, ఎలాన్ మస్క్ తన తల్లితో కలిసి మెట్ గాలాకు హాజరయ్యారు. తాను వస్తానని తల్లి కోరడంతో వెంట తీసుకెళ్లినట్టు చెప్పాడు ఎలోన్. ఆ ఈవెంట్లో మస్క్ టీం గాయని స్కై ఫెరీరాతో డేటింగ్ కోసం అడిగినట్టు పుకార్లు వచ్చాయి. అయితే వాటిని కొట్టిపారేసిన మాయే..ఆ ఈవెంట్లో తన టీం ఎవరూ లేరని…కొడుకు వెంట తానే ఉన్నానంటూ అవన్నీ తప్పుడు వార్తలంటూ ఫొటోలు షేర్ చేసింది.
ఎంత డబ్బున్నా తల్లీకొడుకుల మధ్య ఉండే అనుబంధమే గొప్పది. మదర్స్ డే సందర్భంగా …ట్విట్టర్ ను కూడా సొంతం చేసుకున్న వేళ కొడుకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడా అని కొందరు మాయే ను అడిగారు. ఆమె ఇచ్చిన సమాధానమేంటో తెలుసా ‘మంచి బహుమతి అంటే నా దృష్టిలో కౌగలింతలే. నేను వాటిని నా మనవళ్లు, నా పిల్లలకూ ఇస్తాను. అన్నివేళలా నేనూ వారికిచ్చే కానుక అదే. అంతకుమించిన ఆనందం ఇంకేమైనా ఉంటుందా’ అని. సందర్భం వచ్చిన ప్రతిసారీ ఎలోన్ పై తన ప్రేమను వ్యక్తపరుస్తూ తన చిన్ననాటి జ్ఞాపకాల్నీ అపురూపంగా సోషల్‌మీడియాలో షేర్ చేస్తుంటారు మాయె.