సినీ క్రిటిక్, నటుడు కత్తి మహేష్ మరణంపై రకరకాల అభిప్రాయాలు, వ్యాఖ్యలు వినిపిస్తున్నారు..రాముడిని దూషించినందువల్లే అతనికి భయంకరమైన చావు వచ్చిందని కొందరంటుంటే…చనిపోయిన వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడకూడదని కొందరంటున్నారు.ఇక పూనమ్ కౌర్ వంటి సెలబ్రిటీలు సైతం స్పందించారు. ఇక వ్యక్తిత్వ వికాస నిపుణులు, టెక్నాలజీ ప్రభావం, ఆన్లైన్ భద్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ…ఎందరిలోనే చైతన్యం నింపే శ్రీధర్ నల్లమోతు కత్తిమరణంపై స్పందించిన తీరు చర్చనీయాంశమైంది…సోషల్‌మీడియాలో ఆయన పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది..
ఇంతకీ శ్రీధర్ ఏమన్నారో చూద్దాం..
ఒక వ్యక్తిగా మిత్రులు కత్తి మహేష్ మీద అపారమైన గౌరవంతో.. ఇప్పటికైనా కొన్ని విషయాలు రాయకపోతే మరుగునపడిపోతాయని ఇది రాస్తున్నాను. కత్తి మహేష్ గారు మేధావి, చాలా ఆలోచనా పరుడు అని అందరం అంటున్నాం. మేధస్సు అంటే సమాజాన్ని ప్రశాంతంగా ఉంచేది, సమాజంలో అశాంతి రేకెత్తించేది కాదు అని ఎంతమందికి తెలుసు?
కత్తి మహేష్ అణగారిన వర్గాలకు ధైర్యమున్న స్వరం అని అంటుంటారు.. చాలా గొప్ప విషయం. ప్రతీ వర్గానికీ అలాంటి ఒకరు ఉండాలి.. కానీ అణగారిన వర్గాలకు రాముడు ఏ అన్యాయం చేశాడు, పవన్ కళ్యాణ్ ఏ అన్యాయం చేశాడు? శ్రీరాముడు ఉన్నాడా లేదా అన్నది పక్కన పెట్టండి.. ఏ మేధావైనా ఇతరుల అభిప్రాయాలూ, మనోభావాలను గౌరవిస్తాడు. శ్రీరాముడిని కొన్ని కోట్ల మంది ఆరాధిస్తారు. ఇతరుల నమ్మకాలను గౌరవించాలన్న సంస్కారం లేనప్పుడు అదేం మేధస్సు? లైమ్‌లైట్‌లోకి రావడానికి ఏదో ఒక ఇష్యూ కావాలి కాబట్టి ఏది మాట్లాడితే తేనెతుట్టె కదులుతుందో ఆ వివాదాస్పద అంశాలను మాట్లాడడమే మేధస్సా? ఈ మేధస్సుతో మిగతా వాళ్లు ఇన్స్పైర్ అయి మీరు కూడా సమాజంలో విచ్ఛిన్నం సృష్టిస్తారా?
ఒకరోజు NTV డిబేట్‌కి మిత్రులు కత్తి మహేష్ నేనూ వెళ్లాం. క్రింద ఛాంబర్లో NTV న్యూస్ రీడర్ చక్రి నేను, కత్తి మహేష్ మాట్లాడుకుంటూ ఉండగా, చక్రి బయటకు వెళ్లారు పని ఉండి! నేను కత్తి మహేష్‌ని అడిగాను.. ఎందుకు ఇలాంటి వివాదాల్లోకి వెళుతుంటారు అని చనువు కొద్దీ! “మరి రాజకీయాల్లోకి వెళ్లాలి కదా” అని నవ్వుతూ బదులిచ్చారు. అంటే రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఓ ఎజెండాతో సమాజంలో విచ్చిన్నం రేకెత్తించడం ఎంత వరకూ సమజసం? నేను ఏమీ అనలేక ఊరకుండిపోయాను.
ఒక వ్యక్తి స్వార్థానికి సమాజంలో గొడవలు రేగడం ఎంత వరకూ సమంజసం? రాజకీయాల్లోకి వెళ్లాలంటే సేవ చేసి వెళ్లొచ్చు కదా! ఏదో రకంగా పాపులారిటీ రావడమే ముఖ్యమా? కత్తి మహేష్‌కి చాలా సర్కిల్ ఉంది. ఆయన వ్యక్తిగా చాలా మంచి వాడు అని అందరూ మెచ్చుకుంటారు. నాతోనూ ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటారు. కానీ వ్యక్తి స్థాయిలో ఉన్నప్పుడు వేరు, అందరికీ తెలిసిన సెలబ్రిటీగా మారినప్పుడు మరింత బాధ్యతతో ఉండాలి కదా! వ్యక్తిగా ఒకరొకరు నవ్వుకుంటే, భోజనం చేస్తే, కాఫీలు తాగితే సరిపోతుందా.. కోట్లాది మందికి విద్వేషపు సంకేతాలు పంపిస్తూ, ఎప్పుడూ ఎవర్నో ఒకర్ని దూషిస్తూ చేసేది ఏంటి? కత్తి మహేష్‌తో ఉన్న పరిచయాన్ని గ్లామరైజ్ చేసుకునే వాళ్లకి ఆయన గొప్ప కావచ్చు.. సమాజం బాగుండాలని బాధ్యతగా ప్రవర్తించే వాళ్లకి ఆయన ఏమాత్రం గొప్ప కాదు.
అణగారిన వర్గాల ఊపిరి కత్తి మహేష్ అని గొప్పగా చెబుతున్నారు.. సరే బానే ఉంది. అణగారిన వర్గాలతో పాటు ఆయన చుట్టూ ఉన్నత వర్గాలూ కూడా ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. వారెప్పుడైనా ఆయనకి ఆన్యాయం చేశారా? అంతా ఓ స్వంత మనిషిలా ఆయన్ని ట్రీట్ చేశారు కదా.. మరి తన తరంలో వివక్ష లేనప్పుడు, ఎప్పుడో చరిత్రలో జరిగిన వివక్ష గురించి చీకటిలో బాణాలు వేయడం ఏంటి? ఓ వర్గాన్ని తన వైపు తిప్పుకుని రాజకీయంగా ఎదగడానికా? నిజంగానే ఇప్పుడు కూడా వివక్ష ఎక్కడైనా జరుగుతుంటే వెళ్లి స్వయంగా న్యాయం చేయొచ్చు కదా.. అంతే గానీ గంపగుత్తుగా బాగున్న సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం ఏం మేధస్సు? ఇలాంటి మేధావుల నుండి ఏం నేర్చుకుంటారో ఈ సమాజం యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను. ద్వేషం వెదజల్లి, దాని నుండి పాపులారిటీ సాధించేది ఏం మేధస్సు?