దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో అద్భుతమైన సేవలు అందిస్తూ భారతీయతకు మూలంగా నిలిచే సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇది నాగపూర్ కేంద్రంగా భారతదేశమంతా విస్తారంగా పనిచేస్తూ వస్తోంది. అయితే దేశ రాజధాని ఢిల్లీలో కూడా విశాలమైన భవంతి కావాలన్న యోజన .. ఇప్పటికి సాకారమైంది.
ఢిల్లీ కేంద్రంగా ఒక ప్రధాన కార్యాలయాన్ని నిర్మించారు. ఇందులో ఎన్నెన్నో విశేషాలు కనిపిస్తున్నాయి. 4 ఎకరాల స్థలంలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు . ఈ కాంప్లెక్స్‌లో మూడు ఎత్తైన భవనాలు, నివాస గృహాలు, విశాలమైన లైబ్రరీ, ఐదు పడకల ఆసుపత్రి ఉన్నాయి.
మొదటగా 1939లో ఢిల్లీలో ఒక కార్యాలయం ప్రారంభించారు. ఆ తరువాత దానిని విస్తరించారు. ఈ కొత్త కార్యాలయ భవనంకు 2016 ఆగస్టులో పునాది రాయి వేశారు. గుజరాత్‌కు చెందిన ఆర్కిటెక్ట్ అనుప్ దూబే ఆధ్వర్యంలో దీనిని నిర్మించారు.
ఈ భవన నిర్మాణంకోసం సుమారు 75 వేలమంది స్వయంసేవకులు రూ 150 కోట్ల మేరకు విరాళాలుగా సమకూర్చారు. ఈ కార్యాలయంలో 300 గదులు, మూడు పెద్ద ఆడిటోరియంలు ఉన్నాయి.
కేశవ్ కుంజ్ భవన నిర్మాణంలో మూడు ఎత్తైన టవర్లు ఉన్నాయి. ప్రతి టవర్ లో 12 అంతస్తులు ఉన్నాయి.
మొదటిది సాధన టవర్: పరిపాలనా కార్యాలయాలతో ప్రాంత కార్యాలయంగా పనిచేస్తుంది. పదవ అంతస్తులో 8,500 పుస్తకాలతో కూడిన డిజిటల్ గ్రంధాలయం ఉంది. ఇది ప్రజలకు అందుబాటులో ఉంటుంది. భారత్ ప్రకాశన్, సురుచి ప్రకాశన్, పాంచజన్య, ఆర్గనైజర్ వంటి సంఘ్ ప్రచురణల కార్యాలయాలు ఉన్నాయి.
రెండిది ప్రేరణ టవర్: పర్యటనలు చేసే ముఖ్యమైన అధికారుల కోసం నివాసాన్ని ఏర్పాటు చేశారు. వారికి వసతి, కార్యస్థలాన్ని అందిస్తుంది. తొమ్మిదవ అంతస్తులో జర్నలిస్టుల కోసం ప్రత్యేక హాల్ ఉంది. సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబెల లతో సహా ప్రముఖులు.. ఈ భవనంలో బస చేస్తారు.
ఇక మూడోది అర్చన టవర్: ఇతర నగరాల నుండి వచ్చే సహాయక సిబ్బంది, సందర్శకుల కోసం కేటాయించారు. వారి బస కోసం 80 గదులు ఉన్నాయి. క్రింది అంతస్థులో ఒక క్లినిక్, నివాసితులు, సందర్శకులకు సేవ చేయడానికి ఐదు పడకల ఆసుపత్రి ఉన్నాయి. భోజనాలయంలో ఒకేసారి 80 మంది కూర్చునే సామర్థ్యం ఉంది.
మొత్తం మీద అన్ని హంగులతో కూడిన ముఖ్య కార్యాలయంగా దీనిని రూపొందించారు. అయినప్పటికీ ప్రధాన కార్యాలయం మాత్రం నాగపూర్ నుంచే పనిచేస్తుంది. అందుచేత ఈ కార్యాలయం నుంచి విస్తారమైన సేవలు అందుతాయి అని భావిస్తున్నారు