కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించారు. నమస్తే సదా వత్సలే మాతృభూమి అంటూ ఒక్కసారిగా గీతాన్ని ఆయన పాడి వినిపించారు. సహజంగానే ఇది రాజకీయ దుమారం రేపింది.
ఈ సందర్భంగా డీకే శివకుమార్ .. తన వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. తాను జీవితాంతం కాంగ్రెస్ వాదినే, కానీ మంచి భావాలను ఎక్కడ చూసినా గౌరవిస్తానని చెప్పారు. ఆర్ఎస్ఎస్ గీతంలో ఉన్న దేశప్రేమ, మాతృభూమి పట్ల భక్తి మనందరికీ స్ఫూర్తినివ్వాలి అని అన్నారు. బిజెపి, శివసేన, జెడియు వంటి పార్టీలు సంఘ్ గీత్ ఇచ్చిన స్ఫూర్తిని సమర్థించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతోంది.
ఆర్ఎస్ఎస్ గత వంద ఏళ్లుగా దేశవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉంది. వరదలు, తుపాన్ వంటి సమయాలలో సహాయక చర్యలు చేపడుతోంది.
గ్రామీణ ప్రాంతాల్లో విద్యా విస్తరణ, ఆరోగ్య శిబిరాలు, యువతలో క్రమశిక్షణా భావం పెంపు వంటి అనేక రంగాల్లో సంఘ్ పనిచేస్తోంది. లక్షలాది మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా సమాజ సేవలో, దేశ నిర్మాణంలో పాలు పంచుకుంటారు.
భారతదేశం అనేక భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన దేశం. ఇంత విభిన్నత ఉన్నప్పటికీ మనందరినీ కట్టిపడేసేది దేశభక్తి. ఆర్ఎస్ఎస్ గీతం నిరంతరం దేశ భక్తి భావాన్ని ప్రతిబింబిస్తుంది. కర్ణాటక అసెంబ్లీలో అది వినిపించడం, ఆ విలువలను అందరికి గుర్తు చేసింది. రాజకీయాలు ఎలా ఉన్నా… సేవ, దేశప్రేమ వంటి విలువలను గౌరవించడం ద్వారానే నిజమైన జాతీయ సమగ్రత సాధ్యమవుతుంది.