దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచారం కేసు మరోమలుపు తిరిగింది. ఈ కేసులో ఎన్‌కౌంటర్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో దోషులెవరు అనేది కమిషన్ గుర్తించింది. ఇందులో దాచాల్సింది ఏమీ లేదని…. ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు పంపిస్తున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. చట్ట ప్రకారం ఏం చేయాలో హైకోర్టు నిర్ణయిస్తుందని సీజేఐ వ్యాఖ్యానించారు. సిర్పూర్కర్ కమిషన్ నివేదికను సాఫ్ట్‌కాపీ రూపంలో కేసులోని భాగస్వాములందరికీ పంపాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. నివేదికపై ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పుకోవాలని సూచించింది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం.. విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది.
ఈ క్రమంలోనే నివేదికను బహిర్గతం చేయలేమని కోర్టు స్పష్టం చేసింది. నివేదిక బయటకు వస్తే సమాజంలో అనేక పరిణామాలు చోటుచేసుకుంటాయని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసు విచారణలో భాగంగా వీసీ సజ్జనార్ ధర్మాసనం ఎదుట హాజరయ్యారు.
దిశ ఎన్కౌంటర్ కేసుపై సిర్పూర్కర్ కమిషన్ సంచలన నివేదికను ఇచ్చింది. దిశ కేసులో ఫేక్ ఎన్కౌంటర్ అని సిర్పూర్కర్ కమిషన్ తేల్చింది. 387 పేజీలతో సిర్పూర్కర్ కమిషన్ నివేదికను తయారు చేసింది. పోలీస్ మాన్యువల్‌కు విరుద్ధంగా విచారణ జరిగిందని కమిషన్ పేర్కొంది. ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేసేందుకే ఎన్కౌంటర్ జరిగిందని సిర్పూర్కర్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ ఎన్కౌంటర్లో 10 మంది పోలీసులు పాల్గొన్నారని.. వీరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారించాలని కమిషన్ పేర్కొంది. అనుమానిత నిందితులను హతమార్చాలన్న ఉద్దేశంతోనే కాల్పులు జరిపారన్నారు. వారిపై ఐపీసీ 302, 201 ప్రకారం కేసు నమోదు చేయాలని కమిషన్ స్పష్టం చేసింది.