కరోనా తర్వాత రోజువారి చెల్లింపులలో కరెన్సీ వాడటం చాలావరకు తగ్గిపోయింది. అన్ని వర్గాల ప్రజలు గూగుల్ పే, ఫోన్ పే, పేటీ ఎమ్ వంటి డిజిటల్ విధానాలను అవలంబిస్తున్నారు. దీంతో నగదు చెల్లింపులు దాదాపుగా తగ్గిపోయాయి. అటు అన్ని రకాల వ్యాపారులు కూడా .. తమ షాపులు వ్యాపారాల దగ్గర.. స్కానర్లు తప్పనిసరిగా ఉంచుకుంటున్నారు. అందువల్ల ప్రజలంతా మొబైల్ ఫోన్ ద్వారా స్కాన్ చేసి తేలికగా కొనుగోళ్లు జరుపుతున్నారు.
కానీ ప్రభుత్వ వ్యవస్థల్లో మాత్రం పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ జరగటం లేదు. దీంతో అనేకచోట్ల ప్రభుత్వానికి చెల్లింపులు చేయాల్సినప్పుడు కరెన్సీ తప్పనిసరిగా ఉంచుకోవలసి వస్తోంది. ఇది ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వ యంత్రాంగానికి ఇబ్బందిగా మారుతోంది.
ఉదాహరణకు ఆర్టీసీ బస్సుల విషయమే తీసుకుంటే.. బస్సుల్లో ప్రయాణానికి తప్పనిసరిగా నగదును తీసుకు వెళ్లాల్సి వస్తోంది. చేతిలో డబ్బులు లేకపోతే బస్సు ఎక్కలేని పరిస్థితి ఉండడంతో రాపిడో , ఓలా వంటివి .. బుక్ చేసుకుని ప్రయాణాలు చేస్తున్నారు. ఒకవైపు మహిళలకు ఉచిత ప్రయాణం పథకంతో ఆర్టీసీకి రాబడి బాగా తగ్గిపోయింది. మరోవైపు కచ్చితంగా కరెన్సీ రూపం లోనే టికెట్లు కొనాల్సిన పరిస్థితి ఉండడంతో.. పురుషులు కూడా ఆర్టీసీ బస్సులకు దూరం అవుతున్నారు. దీనిని అధిగమించేందుకు దూర ప్రాంతాల బస్సుల్లో స్కానర్లు ప్రవేశపెట్టారు. కానీ పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ ,, సిటీ బస్సులలో మాత్రం ఖచ్చితంగా కరెన్సీ తోటే టిక్కెట్లు ఇస్తున్నారు. దీంతో ఈ బస్సుల్లో టిక్కెట్లు కొని ప్రయాణించే వారి సంఖ్య బాగా తగ్గిపోతోంది.
ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఆర్టీసీ.. పూర్తిస్థాయిలో డిజిటల్ చెల్లింపులు దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్ సిస్టం ను ప్రవేశపెడుతున్నారు. దీని ద్వారా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లతోపాటు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా టికెట్లు తీసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా టికెట్ జారీ మిషన్లను కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ కోసం 13 వేల టికెట్ మిషన్లను ఆర్డర్ చేశారు. ఇందులో ఆరువేల మిషన్లను గ్రేటర్ హైదరాబాద్ లోనే ఉపయోగించబోతున్నారు. ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన 70 రూట్లలో .. ఈ మెషీన్లు ఉపయోగించి చూశారు . చిన్నచిన్న లోపాలను గమనించి వాటిని సరిచేసుకుని త్వరలోనే పూర్తిస్థాయిలో ఈ మిషన్లను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు.
ఈ విధానం అమల్లోకి వస్తే ఆర్టీసీ లో ప్రయాణాలు ఎక్కువ అవుతాయి అని యాజమాన్యం భావిస్తోంది. దీనివల్ల అటు ప్రయాణికులకు, ఇటు ఆర్టీసీకి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే పూర్తిస్తాయిలో డిజిటల్ పేమెంట్లు కావడంతో , డబ్బు ఎప్పటికప్పుడు ఆర్టీసీ యాజమాన్యం అకౌంట్లోకి నేరుగా వచ్చేస్తుంది. ఇది సంస్థ కు కూడా చాలా ఉపయోగకరం.