ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మాజీ ప్రధాని ఇందిరాగాంధీని పోలుస్తూ సోషల్ మీడియాలో చాలా కంటెంట్ ప్రచురిస్తున్నారు. ఇందిరా గాంధీ పాలన అంతా సుపరిపాలన అని ప్రజల కోసం ఎంతో త్యాగం చేశారని కీర్తనలు చేస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం ఇందిరాగాంధీ అంటే త్యాగం, సేవకు ఆమె పెట్టింది పేరు అని పోస్టర్లు వెదజల్లుతున్నారు.
కానీ నిజం మరోలా ఉంది. ఇందిరా గాంధీ పరిపాలన గురించి తెలుసుకోవాలంటే ఎమర్జెన్సీ ని గుర్తు చేసుకోవాలి. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా నోరు విప్పితే చాలు జైలు పాలు చేశారు. అప్పట్లోని అన్ని ప్రతిపక్ష పార్టీల పెద్ద నాయకులందరినీ జైళ్ల లో కుక్కేశారు. భారతదేశ చరిత్రలోనే ఎమర్జెన్సీ అన్నది చీకటి కాలంగా చెప్పవచ్చు.
చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. ఎమర్జెన్సీ తర్వాత కూడా ఆ చీకటి వైభవం కొన సాగింది 1978లో జనతా పార్టీ అధికారం లో ఉండగా ఇందిరా గాంధీ మరియు సంజయ్ గాంధీ మీద కొన్ని కేసులు నమోదు అయ్యాయి. వాటి మీద రగిలిపోయిన యువజన కాంగ్రెస్ నాయకులు అనేక దారుణాలకు తెగబడ్డారు.
విచ్చలవిడిగా అల్లర్లు దౌర్జన్యాలు చేసి సమాజంలో గందరగోళం రేకెత్తించారు.
ఇందిరాగాంధీ దగ్గర మార్కులు కొట్టేసేందుకు చాలా భయంకర పనులకు తెగబడ్డారు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన యువజన కాంగ్రెస్ నేత భోళానాథ్ పాండే చాలా దుస్సాహసం చేశారు. ఏకంగా విమానాన్ని దారి మళ్లించేసి విలయ తాండవం చేశారు. మరో ఇద్దరు యువజన కాంగ్రెస్ నాయకులతో కలిసి ఏకంగా విమానం హైజాక్ కు పాల్పడ్డారు.
1978 డిసెంబర్ 20న కోల్కతా నుంచి ఢిల్లీకి వస్తున్న ఐసి 410 విమానాన్ని యూత్ కాంగ్రెస్ నాయకులు దారి మళ్ళించారు. లక్నోలో విమానం ఎక్కిన పాండే బ్రదర్స్ .. తుపాకీ ని చూపించి పైలెట్ ను బెదిరించారు. ఢిల్లీ వెళ్లాల్సిన విమానాన్ని వారణాసికి తీసుకెళ్లి దింపేశారు. ఇందిరాగాంధీ మీద కేసులు రద్దు చేస్తేనే విమానాన్ని, ప్రయాణికులను వదులుతామంటూ హడావిడి చేశారు.
దేశవ్యాప్తంగా ఇది కలకలం రేపింది. అప్పటి ఉత్తరప్రదేశ్ జనతా పార్టీ ముఖ్యమంత్రి రాం నరేష్ యాదవ్ స్వయంగా హైజాకర్లతో సంప్రదింపులు జరిపారు. కేంద్రంతో మాట్లాడి ఇందిరా మీద కేసుల్ని ఎత్తేస్తామని బుజ్జగించి నచ్చ చెప్పారు. ఈలోగ భద్రత దళాలు విమానం లోకి ప్రవేశించి జాగ్రత్తగా ప్రయాణికులను సురక్షితంగా కాపాడగలిగారు.
హైజాకర్లు పాండే బ్రదర్స్ మీద కేసు పెట్టి జైలుకు తరలించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీన్ మొత్తం రివర్స్ అయింది. ఒక విమానాన్ని హైజాక్ చేసి భయపెట్టిన పాండే బ్రదర్స్ మీద కేసులు ఎత్తేశారు. అంతేకాదు తర్వాత కాలంలో భోళానాథ్ పాండేకి కాంగ్రెస్ పార్టీ తరఫున పదవులు కేటాయించారు. రెండు సార్లు ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి కాంగ్రెస్ తరపున ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
దీనిని బట్టి ఇందిరా గాంధీ పరిపాలన ఏ రకంగా సాగింది అనేది అర్థం చేసుకోవచ్చు. దీనిని సుపరిపాలన అనాలా.. దోపిడీదార్ల రాజ్యం అనాలా అనేది మనమే తేల్చుకోవాలి.