
Supreme Court of India
…………….
భారత సుప్రీంకోర్టు వజ్రోత్సవాలు జరుపుకుంటున్నది. వందమంది దోషులు తప్పించుకున్న పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి కూడా అన్యాయం జరగకూడదు అన్న ప్రాథమిక సూత్రం అమలు చేస్తున్న అద్భుత న్యాయవ్యవస్థగా మన భారతీయ న్యాయ వ్యవస్థను చెప్పవచ్చు. ప్రజాస్వామ్యంలో పౌరుడి హక్కులు, అవకాశాలు కాపాడటం పరమావధిగా మన న్యాయస్థానాలు సేవలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో
అత్యున్నత న్యాయస్థానం 75 వ వార్షిక దినోత్సవాన్ని ఈ ఏడాది జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సెప్టెంబర్ 1 న సుప్రీంకోర్టు కోసం కొత్త జెండా ఇంకా చిహ్నాన్ని ఆవిష్కరించారు. స్మారక తపాలా బిళ్ళను సైతం విడుదల చేశారు. జెండాలో అశోక చక్రం, సుప్రీంకోర్టు భవనం ఇంకా భారత రాజ్యాంగ పుస్తకం కూడా ఉన్నాయి.
ఈ 75 సంవత్సరాల ప్రయాణంలో ముఖ్యాంశాలు ఏమిటి..?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి భారతదేశంలో ప్రజాస్వామ్యం మరియు ఉదారవాద విలువలను కాపాడటంలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. రాజ్యాంగ సంరక్షకుడిగా, అణగారిన వర్గాల హక్కుల రక్షకుడిగా వ్యవహరించింది.
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఇంకా వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించడంలో సుప్రీంకోర్టు పాత్రను నాలుగు దశలుగా వర్గీకరించవచ్చు.
మొదటి దశ (1950 – 1967)
ఇది సుప్రీంకోర్టుకు ప్రారంభ కాలం. ఈ సమయంలోనే ప్రతీ అంశాన్ని రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకునే విచారణలు చేపట్టి, తీర్పులు వెలువరించింది. రాజ్యాంగానికి కట్టుబడి ఉంటూ.. న్యాయపరమైన నియంత్రణను సూచించింది. జమీందారీ వ్యవస్థ రద్దు రాజ్యాంగ విరుద్ధమన్న సుప్రీంకోర్టు.. పార్లమెంట్ చట్టం చేయడంతో దాన్ని అడ్డుకోలేకపోయింది. అలాగే విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు, సమానత్వ హక్కుల ఉల్లంఘనలపై తీర్పులు కూడా చెప్పింది.
– స్వాతంత్య్రానంతరం ప్రారంభ సంవత్సరాల్లో, న్యాయవ్యవస్థ సంప్రదాయవాద విధానాన్ని కొనసాగించింది. రాజ్యాంగాన్ని వ్రాసినట్లుగా అర్థం చేసుకోవడానికి మాత్రమే పరిమితం చేసింది. దాని సరిహద్దులను దాటకుండా.. శాసన చర్యలను తనిఖీ చేయడానికి ఇది న్యాయసమీక్షను నిర్వహించింది. సోషలిజం మరియు నిశ్చయాత్మక చర్య వంటి ప్రభుత్వ సిద్ధాంతాల ద్వారా న్యాయవ్యవస్థ ప్రభావితం కాకుండా నిరోధించింది.
– ఉదాహరణకు 1952లో కామేశ్వర్ సింగ్ కేసు విచారణలో జమీందారీ వ్యవస్థ రద్దును చట్టవిరుద్ధమని ప్రకటించింది. కానీ పార్లమెంటు రాజ్యాంగ సవరణను ఆమోదించడంతో.. సుప్రీంకోర్టు ఆ రద్దును అడ్డుకోలేకపోయింది.
– అలాగే 1951 లో చంపకం దొరైరాజన్ కేసు.. విద్యా సంస్థలలో రిజర్వేషన్లను, సమానత్వ హక్కును ఉల్లంఘించడంగా కొట్టివేసినప్పటికీ.. అది పార్లమెంటుతో ఘర్షణను నివారించిందని, రాజ్యాంగం యొక్క సానుకూల వివరణకు కట్టుబడి ఉందని చూపిస్తుంది.
రెండవ దశ (1967-1976)
ఈ దశలో ముఖ్యంగా పార్లమెంటుతో ఘర్షణను తెచ్చుకున్నట్లు కనిపిస్తుంది. ప్రాథమిక హక్కుల విషయంలో గోలక్ నాథ్ కేసులో సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసు విచారణ ఈనాటికీ ఒక మార్గదర్శిగా ఉంటుంది. అలాగే కేశవానంద భారతీ కేసు, ఎమర్జెన్సీ సమయంలో ఆర్టికల్ 21 కింద జీవించే హక్కుల అంశంలో కూడా కీలక తీర్పులు ఇచ్చింది.
– 1967లో గోలక్ నాథ్ తీర్పు.. ప్రాథమిక హక్కుల యొక్క విస్తృతమైన వివరణలో ఒక సంచలన మార్పును గుర్తించింది. ఇది పార్లమెంట్ యొక్క శాసన అధికారాన్ని సవాలు చేసింది. ఇంకా న్యాయ సమీక్ష అధికారాన్ని పునరుద్ఘాటించింది.
– 1967 గోలక్ నాథ్ కేసులో.. పార్లమెంటు ప్రాథమిక హక్కులను రద్దు చేయకూడదు లేదా తగ్గించకూడదని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. అలాగే రాజ్యాంగ సవరణలపై కూడా మరికొన్ని కీలక తీర్పులు వెలువరించింది.
– 1973 లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు నిర్ణయం ‘ప్రాథమిక నిర్మాణం’ అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది. ఇది రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటు అధికారాన్ని పరిమితం చేసింది. ఈ కేసు న్యాయవ్యవస్థ మరియు కార్యనిర్వాహక వ్యవస్థ మధ్య ఘర్షణకు వేదికగా నిలిచింది.
– ఎమర్జెన్సీ సమయంలో ముగ్గురు న్యాయమూర్తులను పదవీచ్యుతులను చేయడంతో పాటు.. జస్టిస్ ఎఎన్ రేను భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.
– 1976లో జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసులో.. ప్రాథమిక హక్కుల ఆర్టికల్ 21 కింద జీవించే హక్కును నిలిపివేసే ప్రభుత్వ చర్యకు మద్దతు ఇచ్చింది. ఈ తీర్పు ఉన్నత న్యాయవ్యవస్థ యొక్క దుర్బలత్వాన్ని బహిర్గతం చేయడంతో పాటు.. దేశంలో రాజ్యాంగ ప్రజాస్వామ్యం కిందిస్థాయికి చేరినట్లుగా భావిస్తారు.
మూడవ దశ (1978 – 2014)
ఈ సమయం ముఖ్యంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాల విస్తరణను చూపించింది. మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ అంశాలపై న్యాయపరమైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కీలక తీర్పులను వెల్లడించింది. న్యాయమూర్తుల ఎంపికపై పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండేందుకు కొలిజియం వ్యవస్థను కూడా తీసుకొచ్చింది.
– ఎమర్జెన్సీ తర్వాత న్యాయవ్యవస్థ తన స్వాతంత్ర్యం మరియు విశ్వసనీయతను తిరిగి పొందడానికి ప్రయత్నించింది. 1978 లో మేనకాగాంధీ కేసులో ఆర్టికల్ 21 యొక్క వివరణను విస్తృతం చేసింది. జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ యొక్క పరిధిని విస్తరించింది.
– 1979 లో హుస్సేనారా ఖాటూన్ వంటి కేసుల ద్వారా న్యాయవ్యవస్థ, ప్రజా-స్ఫూర్తిగల వ్యక్తులు, అణగారిన వర్గాల తరపున పిటిషన్లు దాఖలు చేయడానికి అనుమతించడం ద్వారా.. న్యాయం పొందే అవకాశాన్ని విస్తరించింది. మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ మరియు పాలన వంటి అంశాలను పరిష్కరించే న్యాయపరమైన క్రియాశీలతకు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఒక సాధనంగా మారాయి.
కొలిజియం వ్యవస్థ
న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా.. న్యాయవ్యవస్థ తన స్వయంప్రతిపత్తిని కొనసాగించడానికి ప్రయత్నించింది. ఈ వ్యవస్థను తరువాత జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టం – 2014 సవాలు చేయగా.. దీనిని కొట్టివేసింది. న్యాయవ్యవస్థ దాని స్వాతంత్య్రాన్ని కాపాడుకుంటుందని.. స్పష్టం చేసింది.
నాలుగో దశ (2014-ప్రస్తుతం)
ఈ కాలంలో చాలా కీలక అంశాలపై సుప్రీంకోర్టు స్పందించింది. ఆర్టికల్ 370 రద్దుతో పాటు.. చరిత్రలో నిలిచిపోయే తీర్పులను వెల్లడించింది. ఈ దశలో రాజ్యాంగాన్ని సజీవపత్రంగా పరిగణించడంపై దృష్టి పెట్టినట్లు చెప్పవచ్చు.
– జమ్మూ & కాశ్మీర్‌ను భారత యూనియన్‌లో పూర్తిగా ఏకీకృతం చేయడానికి ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టు సమర్థించింది. అంతేకాకుండా.. విమర్శలు వస్తున్నా.. రాజ్యాంగ హక్కులను పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ తన పాత్రను నొక్కి చెబుతూనే ఉంది. ఈ క్రమంలో.. పారదర్శకం కాని ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అలాగే వ్యభిచారం.. ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తుందని చెప్పే భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 497ను 2018 లో సుప్రీంకోర్టు కొట్టివేసింది.
సుప్రీంకోర్టు ఎదుర్కొంటున్న కీలక సవాళ్లు ఏమిటి?
– 2023 చివరి నాటికి, సుప్రీంకోర్టులో 80,439 పెండింగ్ కేసులు పోగుపడ్డాయి. ఈ పెండింగ్ కేసుల విచారణ ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. రోజు రోజుకూ పెరుగుతోన్న కేసులతో.. న్యాయం అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇది న్యాయవ్యవస్థ యొక్క సామర్థ్యం ఇంకా విశ్వసనీయతపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
– స్పెషల్ లీవ్ పిటిషన్లు (సివిల్ మరియు క్రిమినల్ అప్పీళ్లకు ప్రాధాన్యతనిచ్చే మార్గాలు) సుప్రీంకోర్టు కేసుల జాబితాలో ఎక్కువ భాగంగా ఉండటం కూడా పరిగణలోకి తీసుకోవాలి. రిట్ పిటిషన్లు ఇంకా రాజ్యాంగ సవాళ్లు వంటి ఇతర రకాల కేసుల కంటే ఎక్కువగా స్పెషల్ లీవ్ పిటిషన్లు వస్తున్నాయి. ఇది సుప్రీంకోర్టు సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పొచ్చు.
– “పిక్ అండ్ సెలెక్ట్ మోడల్”.. కొన్ని కేసులకు మిగతావాటి కంటే ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. అది ప్రాధాన్యతపైనే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఇతర ముఖ్యమైన కేసులతో పోలిస్తే.. హై-ప్రొఫైల్ బెయిల్ దరఖాస్తుకు త్వరితగతిన శ్రద్ధ చూపాల్సి వస్తుంది. కొన్నిసార్లు కొన్ని ముఖ్యమైన కేసులు చాలాకాలంగా విచారణ ఎదుర్కొంటాయి. తీర్పు రావడంలో చాలా ఆలస్యం అవుతుంది. కానీ.. మరికొన్ని కేసులైతే త్వరితగతిన తీర్పును వెల్లడించాల్సి వస్తుంది. ఉదాహరణకు ఆధార్ బయోమెట్రిక్ ఐడి స్కీమ్ సవాలును పరిష్కరించడంలో జాప్యం అయ్యింది కానీ.. ఎన్నికల బాండ్ల కేసు మాత్రం వేగంగా విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెల్లడించింది.
– సుప్రీంకోర్టుతో సహా న్యాయవ్యవస్థలోని అవినీతి ఆరోపణలు.. దాని సమగ్రతకు ఇంకా ప్రజల విశ్వాసాలకు సవాళ్లు అవుతాయి. ఉదాహరణకు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసి.. రాజకీయాల్లోకి ప్రవేశించిన వెంటనే.. ఇదే అంశం తెరపైకి వచ్చింది. న్యాయవ్యవస్థలో అవినీతి ప్రధానంగా చర్చనీయాంశమైంది. న్యాయ నియామకాల ప్రక్రియ, ముఖ్యంగా కొలీజియం వ్యవస్థ పాత్ర వివాదాస్పద అంశంగా మారింది. నియామక ప్రక్రియను మరింత పారదర్శకంగా, జవాబుదారీగా చేయడానికి జాతీయ న్యాయ నియామక కమిషన్ వంటి సంస్కరణలపై చర్చలు జరిగాయి.
– ఇటీవల, రాష్ట్రపతి అఖిల భారత స్థాయిలో న్యాయ నియామకాలకు పిలుపునిచ్చారు. జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా న్యాయ నియామకాలు ఏర్పాటు చేయడం ద్వారా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పొచ్చు. అలాగే జిల్లా కోర్టులకు న్యాయ నియామకాలు ప్రాంతీయవాదం యొక్క ఇరుకైన ఆలోచనల మధ్య కాకుండా.. కేంద్ర, రాష్ట్ర కేంద్రంగా పరిమితులు పెట్టుకోకుండా చేపడుతారు.
– ఈ-కోర్టుల ప్రాజెక్ట్ కూడా కోర్టు కార్యకలాపాలను సులభతరం చేయడంలో చాలా సహాయం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా.. కోర్టు కార్యకలాపాలను డిజిటలైజ్ చేయడం మరియు ఆటోమేట్ చేయడం జరుగుతుంది. ఇది పేరుకుపోయిన కేసులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు.. వాటి సంఖ్యను తగ్గించడంలో సహాయపడుతుంది. 1996 లో ఆర్బిట్రేషన్ మరియు కన్సిలియేషన్ చట్టం వివరించిన విధంగా.. సుప్రీంకోర్టు జోక్యం అవసరం లేని కేసులకు ADR విధానాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. సుప్రీం కోర్టు పోర్టల్‌లో కేసు స్థితిగతులు మరియు ప్రాధాన్యతలను బహిరంగంగా ట్రాక్ చేయడానికి, పారదర్శకతను నిర్ధారించే లక్షణాన్ని చేర్చవచ్చు.
ముగింపు
అద్భుతమైన న్యాయవ్యవస్థను మనకు అందించిన న్యాయ కోవిదులకు మనం రుణపడి ఉండాలి . ఈ వ్యవస్థ ద్వారా సామాన్యుడికి బలం చేకూరాలని మనం ఆశిద్దాం.