వైష్ణవ ఆరాధకులకు ఎంతో విశిష్టమైన ధనుర్మాసం ఈ నెల 16 అంటే సోమవారం నుంచి మొదలవుతుంది. ఈ సందర్భంగా వైష్ణవ ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల సహా అనేక క్షేత్రాలలో ఈ నెల రోజులు తిరుప్పావై పాశురాలు ప్రవచనం చేస్తున్నారు .
ధనుర్మాసం అంటే మనందరికీ తిరుప్పావై గుర్తుకు వస్తుంది.
గోదాదేవి 1200 ఏళ్ల క్రితం అవతరించిన వైష్ణవ భక్తులు . ఆళ్వారులు పాడిన నాలాయిర ప్రబంధంలో(4000 పాశురాలు) గోదాదేవి పాడిన 30 పాశురాలకు అతి విశిష్ట స్థానం ఉంది. గోదాదేవి తనని తాను రేపల్లెలో గొల్లభామగా భావించు కుంది.తమ మధ్యనే తిరుగాడే శ్రీకృష్ణస్వామిని పగలంతా చూస్తున్న సంతోషం, రాత్రివేళ చూడలేని తాపం, తెల్లవారే వేళనే కన్నులారా చూసి తరించాలన్న తపన, ఆత్రం కలబోసిన భావ రాగాను రాగాల పారిజాతాల మాల తిరుప్పావై.
ఈ పాశురాలలో అడుగడుగునా భక్తి భావం కనిపిస్తుంది.
తిరుప్పావైలో ఉన్న మొత్తం పాశురాలు 30. వీటిలో మొదటి అయిదు ఉపోద్ఘాతంగా ఉంటాయి. తిరుప్పావై ప్రాధాన్యతను వివరిస్తాయి. భగవంతునికి చేసే అర్చన మొదలు నివేదన వరకు అన్ని ఉపచారాల్లో ఆడంబరం అవసరం లేదని, చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాశురాలు చెబుతాయి. భగవంతుని ఆరాధించటం వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు నిండుగా పండు తాయని, దేశం సుభిక్షంగా ఉంటుందని వీటిలో ఉంది.
తర్వాతి పది పాశురాల్లో చెలులతో కలిసి శ్రీరంగనాథుని సేవించడానికి గోదాదేవి వెళ్తున్న సన్నివేశాలు వర్ణితమై ఉంటాయి. పదిహేను నుంచి ఇరవయ్యో పాశురం వరకు గోదాదేవి చెలులతో కలిసి దేవాలయానికి వెళ్లిన విషయాలు, అక్కడి శిల్ప సౌందర్యాల వర్ణనలు, రంగ నాథునికి సుప్రభాతం పాడటం మొదలైనవి ఉంటాయి. కృష్ణుడి అష్టభార్యల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా ఈ పాశురాల్లోనే ఉంటుంది.
చివరి పాశురాలు పూర్తిగా భగవంతుడి విలాసాన్ని ప్రకటిస్తాయి. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించు కుంటుంది గోదాదేవి.
చివరగా ఫలశృతి చెబుతూ ఎవరైతే ఈ పాశురాలు ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంది.
ఈ ధనుర్మాసంలో వైష్ణవ ఆరాధన మరియు తిరుప్పావై పారాయణం ఎంతో శుభప్రదం.