భారత పత్రికా సంస్థల చైనా భక్తి!
సోషల్ మీడియాలో జాతీయ వాదులు మన మీడియాను వ్యభిచార మీడియా అనడం మనకు తెలిసిందే. ఇదేదో మాటవరసకు చేసే పదప్రయోగం కాదని నిరూపించడానికా అన్నట్టు అక్టోబర్ ఒకటోతారీఖున ది హిందూ పత్రిక ప్రవర్తించింది. మన ప్రధాన మీడియా సంస్థలకు ధనార్జన తప్ప నైతిక విలువలు, దేశభక్తి ఏకోశానా లేవని మరోసారి ప్రింట్ మీడియా సాక్షిగా నిరూపణ అయింది.
అసలు విషయానికి వస్తే మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమతమ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రధానపత్రికలలో ప్రకటన ఇవ్వడం మనకు తెలిసిందే. గుజరాత్, తమిళనాడులతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ప్రకటనలు తెలుగు పత్రికల్లో చూస్తూనేఉంటాం. ఈ ప్రభుత్వ అడ్వర్టైజ్ మెంట్ ల పేరుతో తమకు అనుకూలంగా వుండే మీడియా సంస్థలకు వందలాది కోట్లు దోచిపెట్టాయని ఏబీఎన్ లాంటి సంస్థల మీద చంద్రబాబు నాయుడి పాలనా కాలంలో అనేక ఆరోపణలు కూడా వచ్చాయి.
మనదేశంలో కేంద్ర ప్రభుత్వం, సాటి రాష్ట్ర ప్రభుత్వాలు చేసే మంచి పనుల గురించి భారత పౌరులందరూ తెలుకోవడానికి అడ్వర్టైజ్ మెంట్ ఇవ్వడంలో తప్పు లేదు. కానీ సుదీర్ఘ చరిత్ర కలిగిన హిందూ పత్రిక చైనాలో జరిగిన అభివృద్ధి గురించి ఫుల్ పేజీ అడ్వర్టైజ్ మెంట్ ఇవ్వడమే ఆశ్చర్యం! చైనాలో మావోన్మాద ప్రభుత్వం ఏర్పడి డెభ్భై సంవత్సరాలు నిండిన సందర్భంగా నేషనల్ డే ఆఫ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పేరిట మూడో పేజీ మొత్తం చైనా పెయిడ్ న్యూస్ తో నింపేశారు. చైనా రాయబారి సందేశం, చైనా ఏడు దశాబ్దాలుగా సాధించిన విజయాలు అంటూ తాము చైనా ప్రభుత్వం నుంచి తీసుకున్న డబ్బుకు తగిన న్యాయం చేశారు.
ఈ మూడోపేజీకి ఇంగ్లీష్ ప్రింట్ మీడియాలో ప్రత్యేక స్థానం ఉంది. సోషల్ మీడియా విప్లవానికి ముందు మెట్రో నగరాల ఇంగ్లీష్ ఎడిషన్ లలో P3P అంటే పేజ్ త్రీ పర్సన్స్ పేరుతో ఎంపిక చేసిన వ్యక్తుల వార్తలు ఘనంగా ప్రచురించేవారు. వీరు నిన్న రాత్రి ఏం తిన్నారు? ఏం తాగారు? ఎవరితో కలిసి ఎక్కడ తిరిగారు? అనే విషయాలు వర్ణిస్తూ కవరేజ్ ఉండేది. కాలక్రమంలో పేజ్ త్రీ పర్సన్ స్థానంలో సెలబ్రిటీ అనే పదం పాపులర్ అయింది. ఒకప్పటి శోభాడేల నుంచి నిన్న మొన్నటి తీస్తా సెతల్వాద్, అరుంధతీ రాయ్ ల వరకు అలా పాపులర్ అయిన వాళ్ళే.
ఇంగ్లీష్ పత్రికలలో పేజీ 3 అంటే మన మాస్ మసాలా భాషలో అమ్ముడుపోయిన జర్నలిస్టుల రాతలు అని ఒక్కమాటలో చెప్పేయొచ్చు. ఒకపక్క దేశసరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత, యుద్ధవాతావరణం, ఇరవైఒక్కమంది సైనికుల బలిదానం, చైనా దురాక్రమణ కాంక్ష ప్రతిరోజూ వార్తలుగా కళ్ళెదుట కనబడుతుంటే ఎంత డబ్బిచ్చినా సగటు భారతీయుడికి చైనాకు అనుకూలంగా కనీసం ఒక్క ఫేస్బుక్ పోస్ట్ చేయడానికి కూడా మనసొప్పదు. కానీ తగినంత సొమ్ము చెల్లిస్తే ఎవరికైనా బాకా ఊదే వ్యభిచార మీడియా మాత్రం తన వృత్తిధర్మాన్ని సమర్థవంతంగా నిర్వహించింది.