దేశ రాజధాని నెలకొన్న ఢిల్లీ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. పదేళ్లుగా పరిపాలన చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ తో రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లు ఢీ కొంటున్నాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండే ఓటు బ్యాంక్ లో చీలిక తేవాలన్నదే ఆప్ ఎత్తుగడ. అందుచేతనే కాంగ్రెస్ ను ఈ ఎన్నికల్లో దూరం పెట్టింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కాంగ్రెస్, బీజేపీ చీల్చుకొంటాయి కాబట్టి తేలికగా గెలుపు సాధించవచ్చన్నది వ్యూహం. ఒక వేళ మెజార్టీ కాస్త తగ్గినట్లయితే కాంగ్రెస్, ఆప్ లు జత కట్టడం తేలికే. ఎందుకంటే ఈ రెండు పార్టీలకు బీజేపీ అంటే తగని మంట. అందుచేత అధికారాన్ని దక్కించుకోవచ్చన్నది ఈ రెండు పార్టీల వ్యూహం.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతున్న వేళ.. మూడు పార్టీల మధ్య బలమైన పోటీ నెలకొంది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ నెంబర్ 36 దాటి తే తప్ప అధికారాన్ని దక్కించుకోవటం కష్టమే. అందుచేత మ్యాజిక్ నెంబర్ కోసం మూడు పార్టీలు బాగా కష్టపడుతున్నాయి. ఢిల్లీ పరిపాలన అంతా ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ చేతిలోనే ఉంది. ప్రస్తుతం వేరే ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ, రిమోట్ కంట్రోల్ మాత్రం ఆయన చేతిలోనే ఉంది. గత 10 సంవత్సరాలుగా ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సారి ప్రధాన పోటీ అధికార ఆప్ పార్టీ-బీజేపీ మధ్యే ఉంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఢిల్లీ పీఠం దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. దీంతో ఈసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారనున్నాయి. మరోవైపు ఆప్ పార్టీ మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్ 48, బీజేపీ 29 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి.
జాతీయ రాజకీయాల్లో బీజేపీ ని గట్టి గా వ్యతిరేకించే ఆప్ పార్టీ, కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిలో కీలకపాత్ర పోషిస్తోంది. ఇటీవల కొన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తో జట్టు కట్టి ముందుకు సాగింది. కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ను దగ్గరకు తీయకూడదని పంతం పెట్టుకొంది. దీంతో మూడు పార్టీలు ఒంటరి పోరాటమే చేస్తున్నాయి. మొత్తం మీద ప్రభుత్వ వ్యతిరేకత, కేంద్రంలోని మోదీ చరిష్మా మీదనే బీజేపీ ఆశలు పెట్టుకొంది. కాంగ్రెస్ కూడా కొద్ది పాటి ఆశలతో ఒంటరి పోరాటం చేస్తోంది. చేసిన పనులతో అధికారాన్ని దక్కించుకొనేందుకు ఆప్ పావులు కదుపుతోంది.