తెలంగాణ అంతట డిగ్రీ కాలేజీలు పూర్తిగా మూత పడ్డాయి. పేద విద్యార్థుల చదువులకు ఉద్దేశించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడంతో కాలేజీలు నడపలేని స్థితికి యాజమాన్యాలు చేరుకున్నాయి. దీంతో నిరవధిక బంద్ కు పిలుపు ఇచ్చారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు చెల్లించాలని వాగ్దేవి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ ఎల్కూచి రాజశేఖర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వేరే దారి లేక ఈ నెల 3వ తేదీ నుంచి నిరవధిక బంద్ పాటిస్తున్నామని ఆయన తెలిపారు.
ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ బోథ్ మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద అధ్యాపకులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. అధ్యాపకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2008లో పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనే గొప్ప ఆశయంతో ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు.
అయితే, గత మూడేళ్లుగా నిధులు విడుదల కాకపోవడంతో ఈ పథకం లక్ష్యం ఈరోజు పూర్తిగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
నిధులు విడుదల కాకపోవడంతో ఇటు కళాశాల యాజమాన్యాలు అటు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజశేఖర్ అన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే, ఫీజులు కట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్న విద్యార్థులు తమ చదువులను మధ్యలోనే ఆపేసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
తమకు ప్రభుత్వంపై ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేసిన రాజశేఖర్, ప్రభుత్వం తమ బాధ్యతగా చెల్లించాల్సిన బకాయి డబ్బులను విడుదల చేయకపోవడం వల్ల తమ కళాశాలల మనుగడ, అధ్యాపకుల ఉద్యోగాలు ప్రశ్నార్థకంగా మారిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం, కళాశాలలను ఆదుకోవడం కోసం పెండింగ్లో ఉన్న బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు తమ గోడును వెళ్ళ బోసుకున్నారు. ప్రభుత్వం విద్యార్థుల ఫీజులు చెల్లించక పోవడంతో కళాశాల యాజమాన్యాలు తమకు జీతాలు కూడా ఇవ్వలేని దీన పరిస్థితుల్లో ఉన్నాయని వాపోయారు. బకాయిల విడుదల ఆలస్యమైతే, తామంతా నిరుద్యోగులుగా మారే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఎల్కూచి రాజశేఖర్, యాజమాన్యం సభ్యులు ప్రవీణ్ రెడ్డితో పాటు అధ్యాపకులు ముత్యం సతీష్, కార్తీక్, ఆడెపు ప్రసాద్, రాజేశ్వర్, సురేష్, పండరి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.






