నిన్నామొన్నటి వరకు భయపెట్టిన వంటనూనెల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నప్పటికీ దిగుమతి సుంకాన్ని కేంద్రం తగ్గించడంతో మనదేశంలో 5 శాతంనుంచి 8శాతం వరకూ ధరలు పడిపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్లో నెలరోజులుగా సోయానూనె, సన్ ఫ్లవర్ నూనె, ముడి పామాయిల్, ఆర్బీడీ పామోలీన్ ధరలు వరుసగా 1.85 శాతం, 3.15, 8.44, 10.92 శాతంగా పెరిగాయి. అయితే దిగుమతి పన్నును కేంద్రం తగ్గించడంతో మనదగ్గర ధరలు తగ్గుతున్నాయి. భారత్‌లో గత ఏడాది కాలంగా గోధుమల ధరలు సైతం నేల చూపులు చూస్తున్నాయి. హోల్‌సేల్, రిటైల్ ధరలు వరుసగా 5.39 శాతం, 3.56 శాతం తగ్గాయి.
గత నెల రోజుల్లో బియ్యం ధరలు హోల్‌సేల్ మార్కెట్లో 0.07 శాతం తగ్గగా రిటైల్ మార్కెట్లో మాత్రం 1.26 శాతం పెరగడం గమనార్హం. ధాన్యం, గోధుమలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్పీ) కేంద్ర ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. ధాన్యం ధర క్వింటాల్‌కు రూ.1,940, గోధుమల ధర క్వింటాల్‌కు రూ.1,975గా నిర్ధారించింది.