అండర్ వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోని కరాచీలో నివసిస్తున్నాడని ఈడీ తెలిపింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా అతని మేనల్లుడు అలీషా పార్కర్ ఈవిషయం చెప్పాడని అధికారులు తెలిపారు. అయితే దావూద్‌తో తాను టచ్‌లో లేనని అలీషా చెప్పాడని చార్జిషీటులో ఈడీ పేర్కొంది. చార్జిషీటు ప్రకారం… దావూద్ ఇబ్రహిం భార్య మెహజాబిన్ పర్వదినాల్లో మాత్రం పార్కర్ కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పలకరించేదని తెలిసింది. దీనికి సంబంధించి అలీషా స్టేట్ మెంట్ ను కూడా ఈడీ చార్జిషీట్ కు జతపరిచింది. ఇదే కేసులో ఎన్సీపీ లీడర్ నవాబ్ మాలిక్ కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో ఛోటా షకీల్ సహాయకుడు సలీం ఖురేషీని కూడా ఈడీ గతంలో ప్రశ్నించింది. ఖురేషీ ఫోర్జరీ పాస్‌పోర్టుపై పలుమార్లు పాకిస్తాన్ వెళ్లినట్టు బయటపడింది. దావూద్ ఇబ్రహిం, ఛోటా షకీల్ తరపున అతడు పనిచేశాడని వివరించింది. ఫిబ్రవరి 3, 2022న ఎన్ఐఏ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా దావూడ్ ఇబ్రహిం, ఇతరులపై ఈడీ మనీల్యాండరింగ్ చట్టాల కింద దర్యాప్తు మొదలుపెట్టింది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. దావూడ్ ఇబ్రహిం, హజీ అన్సీస్ అలియాస్ అనీస్ ఇబ్రహిం షేక్, షకీల్ షేక్ అలియాస్ ఛోటా షకీల్, జావీద్ పటేల్ అలియాస్ జావిద్ చిక్నా, ఇబ్రహిం ముస్తాక్ అబ్దుల్ రజాక్ మీమన్ అలియాస్ టైగర్ మీమన్ నిందితులుగా ఉన్నారు.