ఇవాళ దత్తాత్రేయుని జయంతి . శ్రీ దత్తాత్రేయ జయంతిని మార్గశిర శుక్ల పౌర్ణిమనాడు జరుపుకుంటారు. ఈయనను హిందువులు త్రిమూర్తులు(బ్రహ్మ,విష్ణు,మహేశ్వరు) ల అవతారం కావున దత్తుడిని త్రిమూర్తి స్వరూపుడిగా ఆరాధిస్తారు. సమస్త దేవతలకూ ఆదిగురువులుగా పేరున్న సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి, అనసూయల కుమారుడు దత్తాత్రేయుడు. దత్తా అనే పదానికి “సమర్పించిన” అనే అర్థం వస్తుంది, త్రిమూర్తులు అత్రి మహర్షి, అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు “ఆత్రేయ” అయింది.
త్రిమూర్తుల తత్త్వాలు మూర్తీభవించిన వాడు. దత్తాత్రేయుడు ఉపనయనం అయిన వెంటనే అరణ్యానికి వెళ్లి తపస్సు ద్వారా పరిపూర్ణమైన జ్ఞాన సముపార్జన చేశాడు.
ఈరోజు భక్తులు దత్త చరిత్ర, గుర చరిత్ర, అవధూత గీత, జీవన్ముక్త గీత, శ్రీపాదవల్లభ చరిత్ర, నృసింహసరస్వతి చరిత్ర, శ్రీదత్తదర్శనం వంటివి పారాయణ చేస్తారు.
ఈ పుణ్య తిథి రోజున ప్రతి భక్తుడు
దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర |
బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీ పాద వల్లభ దిగంబర ||
అంటూ స్మరించుకుంటారు.
దత్త సంప్రదాయంలో తొలి అవతారం శ్రీపద్ శ్రీ వల్లభ్, రెండో అవతారం నరసింహ సరస్వతి. అలాగే, అక్కల్కోట్ స్వామి సమర్థ్, శ్రీ వాసుదేవానంద సరస్వతి మాణిక్ ప్రభు, కృష్ణ సరస్వతి కూడా దత్తాత్రేయ అవతారాలుగా భావించబడుతున్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలోని కురుపురం, తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం శ్రీపాద వల్లభ అవతారానికి సంబంధించిన ప్రదేశాలు. కర్ణాటక లోని గాణ్గాపుర్ నృసింహ సరస్వతి అవతారానికి సంబందించిన ప్రదేశం, మహారాష్ట్ర లోని అక్కల్కోట్ ప్రాంతం సమర్థ్ స్వామి కు సంబంధించిన ప్రదేశం.
ఈ నాటికీ, దత్తాత్రేయ ఉపాసకులది ఒక ప్రముఖమైన సంప్రదాయం. ‘కాన్ఫట్’ యోగులు ఈ సంప్రదాయానికి చెందినవారు. ఈనాటికీ వాళ్ళు నల్ల కుక్కలను వెంటపెట్టుకొని తిరుగుతూ ఉంటారు. దత్తాత్రేయుల వారి చుట్టూ ఎప్పుడూ నల్లని నలుపురంగు కుక్కలు ఉంటూ ఉండేవి. ఈనాటికి కూడా ‘కాన్ఫట్’ యోగులు పెద్ద పెద్ద కుక్కలను వెంటపెట్టుకొని తిరుగుతుంటారు. వాళ్ళు ఆ కుక్కలను నేలమీద నడవనివ్వరు. భుజాలకెత్తుకొని మోస్తారు, అవి దత్తాత్రేయుల వారికి ప్రియమైన పెంపుడు జంతువులు కనక వాళ్ళ దృష్టిలో అవి చాలా ప్రత్యేకం.