బాలీవుడ్ సినిమా దిగ్గజం మిథున్ చక్రవర్తికి అద్భుతమైన గౌరవం దక్కింది. సినిమా పరిశ్రమలో ఉత్కృష్టమైన అవార్డుగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కి ఆయనను ఎంపిక చేశారు సినిమా రంగానికి చేసిన విశిష్ట సేవలకు గాను ఈ గొప్ప పురస్కారం దక్కింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న సినీ రంగా నిపుణులు మరియు వివిధ భాషలలోని సినిమాలకు వారు సేవలను పరిగణనలోకి తీసుకొని అనేకమంది అభ్యర్థనలను వడపోత పోసిన తర్వాత తుది విడతగా మిథున్ చక్రవర్తిని ఎంపిక చేశారు.
మిథున్ చక్రవర్తికి చిన్ననాటి నుంచి కళారంగం పట్ల ఆసక్తి ఎక్కువ. 1950లో ఆయన కోల్‌కతాలో జన్మించారు. 1976లో ఆయన నటుడిగా ‘మృగాయ’ అనే సినిమాతో వెండితెర అరంగేట్రం చేశారు. విశేషం ఏమిటంటే తొలి చిత్రంతోనే ఆయన ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాలలో ఆయన నటించి స్టార్ యాక్టర్‌గా మారారు.
హిందీ సినిమాలలోనే కాకుండా ఇతర భాష సినిమాలలో కూడా ఆయన రాణించారు. నటుడిగా, నిర్మాతగా సేవలందించారు. బెంగాలీ, హిందీ, ఒడిశా, భోజ్‌పురి, తమిళ్, కన్నడ, పంజాబీలో దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించారు. 1980, 1990వ దశకాలలో ఓ సూపర్ స్టార్ గా వెలుగొందారు.
దక్షిణ భారతదేశంలోని సినిమా రంగంతో కూడా మిథున్ చక్రవర్తికి అనుబంధం ఉన్నది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన సుపరిచతమే. పవన్ కల్యాణ్ గోపాల గోపాల సినిమాలో స్వామీజీగా నటించి మెప్పించారు. రాజకీయాలపై ఆసక్తితో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి 2014లో రాజ్యసభకు కూడా వెళ్లారు. ఈ సంవత్సరం మొదట్లోనే భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. ఒకే సంవత్సరం నాయకుడిగా నటించిన 19 చిత్రాల విడుదల ద్వారా లిమ్కా బుక్ రికార్డ్స్ ఎక్కారు.
మిథున్ చక్రవర్తి ఈ పేరు చెబితే చాలా మంది టక్కున గుర్తు పట్టకపోవచ్చు కానీ, ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్సర్ సాంగ్ అనగానే సినీ ప్రియులంతా దాదాపుగా గుర్తు పట్టేస్తారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 74 ఏళ్ల మిథున్ గత కొన్ని దశాబ్దాలుగా ఇండియన్ ప్రీమియర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. 1982లో వచ్చిన డిస్కో డ్యాన్సర్‌తో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
మొత్తం మీద అద్భుతమైన నటనతో అలనాటి యువతను ఆకట్టుకున్న మిథున్ చక్రవర్తి ఇప్పటికీ డిస్కో డాన్సర్ గానే గుర్తుండిపోయారు. అందుకే ఆయన సేవలకు గుర్తింపుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.