2020 లో ఆ సైనికుడు దేశసేవలో అసువులు బాసారు. ఆ కుటుంబానికి అండగా నిలిచారు తోటి సైనికులు. తను లేని లోటును పూడ్చే ప్రయత్నం చేస్తూ… అతని సోదరి వివాహాన్ని దగ్గరుండి జరిపించారు. ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ ఇందుకు వేదికైంది.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు లో పనిచేసే శైలేంద్రప్రతాప్ సింగ్ సోదరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకను అన్నీ తామై నిర్వహించారు అతని స్నేహితులు . యూనిఫాంలోనే వారంతాపెళ్లి వేడుకలో పాల్గొన్నారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇందుకోసం సీఆర్పీఎఫ్ జవాన్లైన శైలేంద్ర స్నేహితులంతా రాయ్ బరేలీ వెళ్లారు. పెళ్లివేడుకలో ఆ కుటుంబం వెన్నంటి ఉంటూ శైలేంద్రను మరిపించారు. ఓ అన్న చెల్లెలి కోసం…పెళ్లిలో ఏం చేయాలో అందరూ కలిసి చేశారు. ఆమెను నిండుగా ఆశీర్వదించారు. ఆమెకు ఘనమైన కానుకలూ సమర్పించారు. వాళ్లంతా యూనిఫాంలో పెళ్లికి రావడం అన్నీ తామై వ్యవహరించడంతో అక్కడున్న మిగతావాళ్లు, గ్రామస్థులు ఉద్వేగానికి గురయ్యారు. వధువును మండపానికి తీసుకువస్తూ చేసే ఫూలోంకి చాదర్ లో వారంతా ఆప్యాయంగా తోడ్కొని వచ్చారు.
శైలేంద్ర తండ్రి కూడా సీఆర్పీఎఫ్ జవాన్లను చూసి చాలా సంతోషించారు. కొడుకు లేని లోటును వీరంతా తీర్చారని…నా కుమారుడు సీఆర్పీఎఫ్ సైనికుల రూపంలో కళ్లముందే తిరిగినట్టు అనిపించదని ఉద్వేగంతో చెప్పారు.