దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో కేసులు పెండింగ్ లో మూలుగుతున్నాయి. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం 3.5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి అని తెలుస్తోంది. ప్రతిరోజు 100 కేసులు చొప్పున పరిష్కరించిన కానీ 35 సంవత్సరాల సమయం పడుతుంది. అప్పటికి అంతకు మించిన కేసులు.. మరల పేరుకు పోతాయి.
ఈ స్థాయిలో కేసులు పెండింగ్ లో ఉండటంతో సంబంధిత కక్షిదారులు అందరూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. దేశ జనాభాలో 10 కోట్ల మందికి పైగా కోర్టు సమస్యలు ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం సంవత్సరాల తరబడి ప్రజానీకం ఎదురుచూస్తున్నారు.
దేశంలో పెరిగిపోతున్న లీగల్ పెండింగ్ సమస్య మీద ఉన్నత న్యాయస్థానాలు దృష్టి పెట్టాయి. దేశంలో సరిపడని కోర్టులు న్యాయ వ్యవస్థలు లేవు అని ఇప్పటికే లెక్క తేలింది. రాగల రోజుల్లో కూడా ఏర్పాటు చేసే పరిస్థితి లేనేలేదు. పాశ్చాత్య దేశాల మాదిరిగా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి,, త్వరగా కేసుల్ని పరిష్కరించే వ్యవస్థలు కూడా మన దగ్గర లేవు. సాంప్రదాయ పద్ధతిలో వాయిదాలకు వాయిదాలు వేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలని వెతకాల్సి వస్తోంది.
పెండింగ్ కేసులు పరిష్కారానికి మధ్యే మార్గంగా అదాలత్ వ్యవస్థని ప్రోత్సహించాలి అని నిర్ణయించారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసుల్ని పరిష్కరించుకుంటే కోర్టుల మీద భారం తగ్గుతుంది అని ఉన్నత న్యాయస్థానాలు సూచిస్తున్నాయి. ఇందుకు వీలుగా అన్ని జిల్లా కేంద్రాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి అని ఉన్నత న్యాయస్థానం సూచించింది. తెలంగాణ వ్యాప్తంగా ఈ సదస్సుల కోసం రాష్ట్ర హైకోర్టు చొరవ తీసుకుంటోంది. పెద్దల దగ్గర కూర్చుని మాట్లాడుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నిటికీ కోర్టుల మీద ఆధారపడడం మంచిది కాదని న్యాయమూర్తులు హితవు పలుకుతున్నారు.
తాజాగా హైదరాబాదులో ఏర్పాటైన ఒక సదస్సులో హైకోర్టు న్యాయమూర్తులు విచ్చేసి ఇదే విషయాన్ని తెలియజేశారు. పాతకాలపు భారతీయ విధానంలో ఇది విజయవంతం అయిందని వివరించారు. పెద్దల సమక్షంలో పరిష్కారం చేసుకుంటే ఇరుపక్షాలకు మంచిది అని సూచించారు.