ఛత్రపతి శివాజీ సాక్సిగా కమ్యూనిస్టులు తమ బుద్ది బయట పెట్టుకొన్నారు. అడ్డగోలుగా అబద్దాలు తయారుచేసి జనం మీదకు వదిలేస్తున్నారు. నిస్సిగ్గుగా ఫ్లెక్సీలు పెట్టి కూడా బురద చల్లుతూ.. ఆనందం పొందుతున్నారు.
శివాజీ జయంతి రోజున కామ్రెడ్ల నాటకాలు మామూలుగా లేవు. హైదరాబాద్ నడిబొడ్డున నారాయణగూడ ప్రాంతంలో.. కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం ఎదుట పెద్ద ఫ్లెక్సీ వేశారు. శివాజీ గొప్పతనం, పోరాటం గురించి ఒక్కముక్క కూడా రాయనే లేదు. కమ్యూనిస్టు అభిమానులు వేసిన ఈ ఫ్లెక్సీలో అబద్దాన్ని మాత్రం అందంగా అతికించేశారు. ఛత్రపతి శివాజీ శూద్రుడు కాబట్టి ఆయన కు పట్టాభిషేకం చేసేందుకు హైందవ పురోహితులు నిరాకరించారు అని రాసి పెట్టేశారు. అంతేగాకుండా శివాజీని అవమానించేందుకు నిండు సభలో కాలివేలితో కుంకుమ బొట్టుని దిద్దారు అని కూడా విషం చిమ్మేశారు. ఈ ఫ్లెక్సీలో రాసిన రాతలనే మొదటగా చూద్దాం.
భారత జాతిని ఏకతాటి మీదకు తెచ్చిన అద్భుత పరాక్రమవంతుడు ఛత్రపతి శివాజీ. ఆయన పట్టాభిషేకం మేళ తాళాలతో వేద మంత్రాల సాక్షిగా జరిగింది అని చరిత్రలో స్పష్టంగా రాసి ఉంది. అంటే అప్పటి వేదపండితులంతా స్వయంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు అనేకదా అర్థం. అటువంటప్పుడు ఆయన పట్టాభిషేకాన్ని బ్రాహ్మణ పండితులు నిరాకరించటం ఎలా సాధ్యం అవుతుంది. అసలు రాజుగారు ఒక కార్యక్రమాన్ని చేస్తుంటే, అందులో పాల్గొనేది లేదు అని ఎవరైనా ఎందుకు చెబుతారు. పైగా విదేశీ పాలకులకు వ్యతిరేకంగా పోరాడుతూ భారత జాతిని ఏకతాటి మీదకు తెచ్చిన మహానుభావుడిగా శివాజీ పేరు మార్మోగిపోతున్న తరుణం అది. తల్లి జిజియా భాయి, గురువు సమర్థ రామదాసు నుంచి హైందవ మత సంస్క్రతి, సంప్రదాయాలు వంట బట్టించుకొన్న అద్భుతమైన నాయకుడు ఆయన. కులాలు, వర్గాలకు అతీతంగా అంతా ఆయనకు జేజేలు పలికారు అన్నది అక్షర సత్యం.
పైగా అనేక రాజ్యాలను ఒంటిచేత్తో ఓడించిన ఒక చక్రవర్తికి ఎంతటి ఆత్మాభిమానం ఉంటుంది. అటువంటి మహనీయునికి ముఖం మీద కాలు ఎత్తేందుకు ఎవరైనా సాహసిస్తారా.. అలా చేస్తే చుట్టూ ఉన్న సైన్యం ఊరుకొంటుందా.. శివాజీ ముఖం మీద కాలితో బొట్టు పెట్టారు అని అబద్దం చెప్పేస్తున్నారు అంటే ఎంతటి బురద జల్లుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇష్టం లేక పోతే ఇంటి దగ్గర ఉండిపోతారు కానీ నిండుసభలో కాలితో ముఖం మీద దిద్దుతాను అంటే ఎవరు ఒప్పుకొంటారు, రాజు ఎలా అంగీకరిస్తారు, సైన్యం బలగాలు ఎలా చూస్తూ ఉంటాయి.
పైగా అప్పట్లో విదేశీ పాలకులకు వ్యతిరేకంగా భారతీయ రాజులను ఏకం చేసిన ఘనత శివాజీ ది. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఆయన తపస్సుని మెచ్చి స్వయంగా భవానీ మాత ప్రత్యక్షం అయి ఖడ్గాన్ని బహుకరించింది. అంతటి అపర భక్తి తత్పరుడు శివాజీ. అమ్మవారిని స్వయంగా దర్శనం చేసుకొన్న పరమ భక్తుడు ఆయన. అటువంటి శివాజీ ముఖం మీదకు వేదం చదువుకొన్న పండితుడు కాలు ఎత్తుతాడా. ఎలాంటి అబద్దం ఇది. అసలు అబద్దం చెప్పేందుకైనా..ఆధారాలు చూసుకోరా..
ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. అకస్మాత్తుగా శివాజీ మీద కమ్యూనిస్టులకు ప్రేమ ఎందుకు పొంగిపోతోంది. అటువంటప్పుడు శివాజీ జీవితంలోని ముఖ్యమైన ఘట్టం ముస్లిం పాలకుల్ని తరిమి తరిమి కొట్టడం. ముస్లిం రాజుల దురాగతాలను ఎలుగెత్తి చాటడం. మరి అటువంటప్పుడు శివాజీని ప్రేమించే ఉద్దేశ్యం ఉంటే, ఒక పది ఫ్లెక్లీలు తెప్పించి ముస్లిం రాజులకు వ్యతిరేకంగా పెట్టేసి శివాజీ స్ఫూర్తిని చాటుకోవచ్చు కదా. అసలు విదేశీ నాయకులు అంటే చైనా రష్యా నేతలకు ఫోటోలు కట్టించి పూజించుకొనే కమ్యూనిస్టులకు, విదేశీ పాలకులకు వ్యతిరేకంగా పోరాడే శివాజీ మీద ప్రేమ ఉందంటే ఎవరు నమ్ముతారు.
నిజానికి శివాజీ జయంతి రోజున ఆయన చేసిన గొప్పపనులు, ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకోవాలి. ఆయన ఔన్నత్యాన్ని తెలియచేసే ఫ్లెక్సీలతో ప్రచారం చేసుకోవాలి. లేని పక్షంలో ఇంట్లో కూర్చోవాలి కానీ అబద్దాల్ని అతికేస్తూ ఫ్లెక్సీలు పెడితే, జనం ఉతికేసే రోజులు వచ్చి తీరతాయి.