ఈ నెల 14వ తేదీ వాలెంటైన్స్ డే. అంటే ప్రేమికుల రోజు. కానీ ఇదసలు ఈ దేశ సంస్కృతికి ఏ మాత్రం సంబంధం లేని పాశ్చాత్య వేడుక. బ్రిటీష్ వాళ్లు ఈ దేశం మీద రుద్దిన దుష్ట సంస్కృతుల్లో ఒకటి. ఇది సెయింట్ వాలెంటైన్ అనే క్రైస్తవ ప్రవక్త కి సంబంధించిన పండగ. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో శృంగారం, ప్రేమ పేరుతో వాణిజ్య వేడుకగా మారింది. ఆ రోజు గ్రీటింగ్ కార్డ్స్, గిఫ్ట్స్, కేకులు, కండోమ్స్ వ్యాపారం బాగా జరుగుతుంది.
ఈ వాలెంటెన్స్ డే కి వ్యతిరేకంగా హిందూ సంఘాలు ప్రతీ సంవత్సరం గొడవలు చేయడం కొన్నేళ్లుగా సర్వసాధారణం అయిపోయింది.
అయితే, ఈ సంవత్సరం వేరే విధంగా వివాదం మొదలయ్యింది. కేంద్ర పశు సంవర్ధక శాఖ ఈ 14వ తేదీని “అవు ఆలింగన దినంగా” జరుపుకోమని పిలుపు ఇచ్చింది.
ఇంకేం ? యథాప్రకారం మన ఉదరవ్యాధి వాళ్లంతా ఈ పిలుపును అపహాస్యం చేయడం మొదలు పెట్టారు.
అసలు ఆవు కొన్ని వేల సంవత్సరాలుగా ఈ పవిత్ర భూమితో పెనవేసుకు పోయింది. ఇప్పటికి ఆవులను గ్రామాల్లో తమ కుటుంబ సభ్యులుగా సాకుతారు. గతంలో గ్రామాల ఆర్ధిక వ్యవస్థకు ఆవులు మూల స్తంభాలు.
పాలు ఇవ్వడం దగ్గర నుండి దాని పేడ ఎరువులుగా, మట్టి ఇళ్ల గోడలకు రక్షణ పూతగా, ఇంటి ముందు దుమ్ము రేగకుండా వాకిట్లో కళ్ళాపి జల్ల డానికి ఇలా పలు విధాలుగా ఉపయోగించే వారు.
అయితే ప్రజలు పల్లెల నుండి పట్టణాలకు వలసలు పోవడం, గోవధ పెరిగిపోవడంతో
గోవుల పెంపకం, సంరక్షణ వంటివి తగ్గిపోయాయి. దీనితో దేశీ ఆవుల సంఖ్య బాగా తగ్గిపోతోంది. ఆంతే కాక పాలు ఎక్కువ ఇస్తాయి అని దేశీయ అవుల బదులు జర్సీ వంటి హైబ్రీడ్ ఆవుల పెంపకం వల్ల కూడా దేశీయ ఆవుల సంఖ్య తగ్గిపోతోంది.
ప్రజల్లో మళ్ళీ ఆవుల పట్ల సానుకూల దృక్పథం కలిగించే ఉద్దేశ్యంతో కేంద్ర పశుసంవర్ధక శాఖ ఈ నెల 14న వచ్చే వాలంటైన్స్ డే బదులుగా దానిని ” కౌ హగ్ డే’ గా జరుపుకోమని ప్రజలకు పిలుపు ఇచ్చింది.
అంటే ఈ పిలుపు రెండు రకాలుగా సమాజానికి ఉపయోగం.
1. వేలంటైన్ డే ని వ్యతిరేకించే వారిని ఆ నెగటివ్ దృక్పథం నుండి పాజిటివ్ దృక్పథం వైపు మళ్లించి వారి శక్తిని సమాజ శ్రేయస్సు కి ఉపయోగపడేటట్లు మళ్లించడం.
2. సామాన్య ప్రజలలో గోవుల పట్ల ఆసక్తి పెంచడం, గోవుల సంరక్షణ బాధ్యత నిర్వహిస్తున్న స్వచ్ఛంద గోశాలలు మొదలగు వాటిని ప్రజలకు చేరువ చేసి ఆ సంస్థలు ఆర్ధికంగా బలోపేతం అయ్యేందుకు ప్రయత్నించడం. పాశ్చాత్య దేశాలలో ఈ “కౌ హగ్గింగ్” అనేది గత పది సంవత్సరాలుగా బాగా పాపులర్ అయింది..
ఈ కౌ హగ్గింగ్ అనేదానిని డచ్‌లో “కో నఫ్ఫెలెన్” (అంటే “ఆవుని కౌగిలించుకోవడం”)గా పిలువబడే ఈ వెల్ నెస్ కార్యక్రమం బాగా పాపులర్ ఆవడంతో, మిగతా దేశాలు కూడా మొదలు పెట్టాయి. వెచ్చగా ఉండే ఆవు శరీర ఉష్ణోగ్రత, నెమ్మదిగా కొట్టుకునే గుండె చప్పుడు, దాని శరీర పరిమాణం వాటిని కౌగిలించుకోవడం చాలా ఓదార్పు అనుభూతిని కలిగిస్తుంది అని చాలా మంది పాశ్చాత్య మానసిక నిపుణులు చెపుతున్నారు.
అందుకే, ఆవును కౌగిలించుకోవడం అనేది ప్రపంచ ఆరోగ్య ఉద్యమంగా ఎదిగింది, ఇది అలసిన నరాలకు ఉపశమనం కలుగచేస్తుంది మరియు శరీరాన్ని ప్రశాంతపరుస్తుంది.
రోటర్‌డామ్ మరియు స్విట్జర్లాండ్ నుండి అమెరికాలో ని ఆవుల ఫామ్‌లకు సందర్శకుల రద్దీ గణనీయంగా పెరిగిందని బిబిసి నివేదిక పేర్కొంది. కొన్ని సంస్థలు ఈ “కౌ హగ్గింగ్” గంటకు 75 డాలర్లు అంటే సుమారు ₹6000వరకు వసూలు చేస్తాయి. ఇక్కడకు వచ్చేవారు ఆవుతో విశ్రాంతి తీసుకోవడానికి, ఆలింగనం చేసుకోవడానికి, కౌగిలించుకోవడానికి లేదా గంటల తరబడి మాట్లాడటానికి మొగ్గు చూపుతారు అని బిబిసి నివేదిక పేర్కొంది.
పాశ్చాత్యులు ఇలా చెపుతూ ఉంటే ఈ భూమి పుట్టి కూడా ఎర్ర భావనలు బుర్ర నిండా నింపుకున్న వాళ్ళకి ఇదొక చెత్త ఆలోచన అనిపించడం లో తప్పు లేదు. లంప్ వ్యాధి ఉన్న అవుల్ని కౌగలించుకుంటారా వెర్రిప్రశ్నలూ వేస్తున్నారు…అంటే కుక్కలను కౌగలించుకోవడం అంటే వాళ్లు గజ్జి కుక్కలను కౌగలించుకుంటారేమో. కానీ, కేంద్ర ప్రభుత్వ ఈ ఆలోచన మాత్రం నిజంగా అద్భుతమైన ఆలోచన. ఆరోజు దేశంలో గోశాలలు కళకళలాడతాయి. ఏడుపు గొట్టు మొహాలను ఎప్పుడూ నవ్వించలేం. వాళ్ళని అలాగే వదిలేద్దాం…
…..చాడా శాస్త్రి….