దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు బీజేపీ జాతీయఅధ్యక్షుడు జేపీ నడ్డా. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని…నియంతృత్వ పాలన సాగుతోందని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన ఆయన తమ ధర్మపోరాటానికి మద్దతివ్వాలని ప్రజలను కోరారు. ముందుగా సికింద్రాబాద్ లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
తెలంగాణ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకే వచ్చానని….బుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం బీజేపీ పోరాడుతుందని భరోసా ఇచ్చారు. 317 జీవోను సవరించేవరకూ బీజేపీ పోరాడుతుందన్నారు. దుబ్బాక, హుజురాబాద్ ఓటమితో కేసీఆర్ మానసిక స్థితి దెబ్బతిందని… అవే ఫలితాలు తెలంగాణలో రిపీట్ అవుతాయని అన్నారు.
బిజేపీ క్రమశిక్షణ గల పార్టీ అని కరోనా నిబంధనలు పాటిస్తూ నిరసన తెలుపుతున్నామని అన్నారు. ఉద్యోగుల కోసం…శాంతియుతంగా జాగరణ దీక్ష చేపట్టిన బండిసంజయ్ పై పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గమన్నారు. ఎంపీ క్యాంప్ ఆఫీసులోకి చొచ్చుకెళ్లి నాయకులపై, కార్యకర్తలపై లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తున్నామన్న నడ్డా…కేసీఆర్ ఆదేశాలతోనే పోలీసులు హింసకు పాల్పడ్డారని విమర్శించారు.
కేసీఆర్ తీరుపై సిగ్గుచేటని… రాష్ట్రంలో కుటుంబపాలన సాగుతోందని…కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటిఎంలా మారిందని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కింద ఒక్క చుక్క నీరు రాలేదని అంటూ వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు గా ఉంది కేసీఆర్ తీరని దుయ్యబట్టారు. బండి సంజయ్ అరెస్ట్‌ను జాతీయ పార్టీ ఖండిస్తుందని చెబుతూ ప్రజాస్వామ్య యుతంగా పోరాటం చేస్తామని నడ్డా స్పష్టం చేశారు.
ప్రెస్ మీట్ సందర్భంగా… కరోనా సమయంలో కేసీఆర్ నిర్లక్ష్యపూరిత మాటల వీడియోను చూపించారు నడ్డా. అటు తన హక్కులకు భంగం కలిగించారంటూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాసిన ఫిర్యాదు లేఖపై స్పీకర్ ఓంబిర్లా స్పందించారు. 48 గంటల్లో నిజ నిర్ధారణ చేసి…నివేదిక ఇవ్వాలని కేంద్ర హోం శాఖను ఆదేశించారు. దీనికి సంబంధించి తెలంగాణ అధికారులకు ఇప్పటికే నోటీసులు అందినట్లు సమాచారం. ప్రివిలేజ్ మోషన్ కింద స్పీకర్‌కు సంజయ్ లేఖ రాశారు.