కాళీమాత పోస్టర్ పై చెలరేగిన వివాదం మరింత ముదురుతోంది. లీనా మణిమేకలై అనే ఫిల్మ్ మేకర్ రూపొందించిన డాక్యుమెంటరీకి సంబంధించిన ఆ పోస్టర్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో పలువురు ఉదారవాదులు, సెక్యులరిస్టులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
రిథమ్స్ ఆఫ్ కెనడాలో భాగంగా ఆమె ఈ డాక్యుమెంటరీ తీశారు. టొరంటోలోని ఆగాఖాన్ మ్యూజియంలో ఆ పోస్టర్ విడుదల చేశారు.అయితే వివాదానికి తమ మ్యూజియం వేదిక అవడంపై సంస్థ విచారం వ్యక్తం చేసింది. హిందువుల మతపరమైన మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న కాళీ డాక్యుమెంటరీ ప్రదర్శనను నిలిపేస్తున్నట్టు ఆగాఖాన్ మ్యూజియం ప్రకటించింది. క్షమాపణలు సైతం చెప్పింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ… టొరెంటో మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయం భిన్నజాతి, సాంస్కృతిక నేపథ్యాలకు చెందిన విద్యార్థులనుంచి రచనలు, డాక్యుమెంటరీలు కోరిందని..అండర్ ది టెన్త్ ప్రాజెక్ట్ కోసం కోలీవుడ్ ఫిల్మ్ మేకర్ లీనా మణిమేఖలై కాళీని రూపొందించిందని తెలిపింది. విభిన్న మత వ్యక్తీకరణలు , విశ్వాసాలను గౌరవించేలా చూపడమే ఆ మిషన్ ఉద్దేశమని..అందువల్ల కాళీని మ్యూజియంలో ప్రదర్శించబోమని ఆగాఖాన్ మ్యూజియం స్పష్టం చేసింది. వివరాలతో విశ్వవిద్యాలయ వెబ్ సైట్లో ప్రకటన ఇచ్చింది యూనివర్సిటీ CERC మైగ్రేషన్ విభాగం తెలిపింది.
అటు హిందూ దేవత కాళీ పేరుతో ఉన్న అభ్యంతరకర చిత్ర ప్రదర్శనను ఉపసంహరించుకోవాలని అంతకుముందే ఒట్టావాలోని భారత హైకమిషన్ కెనడా అధికారులను కోరింది. “అగాఖాన్ మ్యూజియంలో అండర్ ది టెన్త్ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రదర్శించబడిన చిత్రం పోస్టర్‌పై హిందూ దేవుళ్లను అగౌరవంగా చిత్రీకరించడంపై కెనడాలోని హిందూ సంఘాల నాయకుల నుండి మాకు ఫిర్యాదులు అందాయి..”అని తెలిపింది. ఇటువంటి రెచ్చగొట్టే అంశాలన్నింటినీ ఉపసంహరించుకోవాలని కెనడియన్ అధికారులను మరియు ఈవెంట్ నిర్వాహకులను కమిషన్ కోరింది.
ఫిలిం మేకర్ లీనా మణిమేకలై సోషల్ మీడియాలో ఈ పోస్టర్‌ను షేర్ చేయడంతో వివాదం మొదలైంది. కాళీ మాత వస్త్ర ధారణలో ఉన్న ఓ మహిళ సిగరెట్ కాల్చుతున్నట్లు ఈ పోస్టర్లో ఉంది. ఈ దేవత చేతిలో ఎల్‌జీబీటీక్యూప్లస్‌కు చెందిన జెండా ఉంది పోస్టర్లో. ఇంత జరిగినా ఎంత మాత్రం పశ్చాత్తాపం లేదు ఫిల్మ్ మేకర్ లీనాకు . భారత్ లోని నెటిజన్లూ ఆమెపై మండిపడుతూనే ఉన్నారు. అయినా తగ్గని ఆమె… నాకు పోయేదేంలేదని.. ఎవరికీ తాను భయపడేదాన్ని కాదని… ఇలాగే ఉంటానని..ఏం చేస్తారో చేసుకోండని ప్రకటించింది.
కాళీమాత సిగరెట్ కాల్చుతున్నట్టు కనిపించేలా తీసిన డాక్యుమెంటరీ పోస్టర్ ను విడుదల చేసిన ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలైపై యూపీ హజ్రత్ గంజ్ లోనూ, ఢిల్లీలోనూ కేసులు నమోదయ్యాయి. ఆమె రూపొందించిన ‘కాళీ’డాక్యుమెంటరీ పోస్టర్లపై అడ్వకేట్లు వేద్ ప్రకాశ్ శుక్లా, వినీత్ జిందాల్ వేర్వేరుగా చేసిన ఫిర్యాదుల మేరకు ఈ కేసులు నమోదయ్యాయి. అలాగే కాళీమాతపై వివాదాస్పద వ్యాఖ్య చేసిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై కోల్ కతాలో కేసు నమోదైంది. ఆమె వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కోల్ కతాలో బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.
ఇదిలావుండగా, స్మోకింగ్ కాళీ పోస్టర్‌పై కెనడాలోని భారత హై కమిషన్ సోమవారం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి రెచ్చగొట్టే అంశాలను తక్షణమే ఉపసంహరించాలని కెనడా అధికారులను, ఈవెంట్ ఆర్గనైజర్లను కోరింది. కెనడాలోని పలు హిందుత్వ సంఘాలు లీనాకు వ్యతిరేకంగా నిరసనకు దిగాయి.
ఇక లీనా పోస్టర్‌పై తీవ్ర అభ్యంతరాలు, నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ట్విట్టర్ సైతం చర్యలకు దిగింది. జులై రెండున కాళీమాత పోస్టర్ ను జతచేస్తూ ఆమె చేసిన ట్వీట్ ను తొలగించింది.