ఇప్పుడు తెలంగాణ అంతటా హైడ్రా పేరు మార్మోగిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఇందులో చాలావరకు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, కోటీశ్వరుల భవంతులు కావడం విశేషం. దీంతో హైడ్రా పేరు చెబితే చాలామంది హడలిపోతున్నారు.
హైడ్రా చీఫ్ గా వ్యవహరిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ మీద ఒత్తిడి తెచ్చేందుకు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవేమీ ఫలించకపోవడంతో ఆయనను భయపెట్టేందుకు కూడా మరికొందరు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. హైడ్రా పరిధిలోకి వచ్చిన విషయాన్ని సీరియస్‌గా తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడమే తన కర్తవ్యం అన్నట్లుగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ముందుకు సాగుతున్నారు. ఆ విషయంలో అవతల వ్యక్తులు అధికార పార్టీనా, లేక విపక్షమా అన్న తేడాలను ఆయన చూపరన్న విశ్వాసాన్ని రంగనాథ్ కల్పించారు.
గతంలో రంగనాథ్ వరంగల్ పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. అక్కడ వరంగల్ కార్పొరేటర్ల భూకబ్జాలు మీద కన్నెర్ర చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన ప్రణయ్ అమృత కేసు విషయంలో గానీ, ఆంధ్రా మీదుగా తరలిస్తున్న గంజాయిని అరికట్టే విషయంలో గానీ
ముక్కు సూటిగా వ్యవహరించారు
గతంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ టీసీపీగా పనిచేసినప్పుడు.. ట్రాఫిక్
క్రమబద్ధీకరణకు తీసుకున్న చర్యలు అందరి మన్ననలు పొందాయి.
ఈ ట్రాక్ రికార్డు రంగనాథ్ కు కలిసి వచ్చింది. అలాంటి అధికారి కావాలని పట్టుబట్టి మరీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిపించి .. హైడ్రా టాస్క్‌ఫోర్స్ బాధ్యతలను రంగనాథ్ భుజస్కంధాలపై ఉంచారు. ముఖ్యమంత్రి అండగా నిలిచి, అక్రమాలను నిలువరించాలని సూచించడంతోపాటు, ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడి ప్రబోధానికి తగ్గట్లుగానే అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతుందని వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
దీంతో రంగనాథ్ ను భయపెట్టేందుకు కొందరు బడా నాయకులు ప్రయత్నాలు చేశారు. ఇటువంటి తాటాకు చప్పులకు ఆయన ఏ మాత్రం బెదరలేదు. దీంతో హైడ్రా బాస్‌పై సుఫారీ గ్యాంగులతో కలిసి కక్షసాధింపు చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది . ఈ మేరకు నికరమైన సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాలు రాబట్టాయి. ఆయనపై పాతబస్తీతో పాటు, పలువురు రాజకీయ, ఇతర ప్రముఖులు కుట్రలకు తెరలేపినట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల సమాచారంతో ఏవీ.రంగనాథ్ ఇంటి వద్ద పోలీస్ భద్రతను ఇప్పటికే పెంచారు. ఆయన వ్యక్తిగత భద్రతను సైతం పటిష్టం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.
మొత్తం మీద రంగనాథ్ మీద ఒత్తిడి భారీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన భద్రత కోసం పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.