పార్లమెంట్ వెలుపల రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు ఇవాళ నిరసనలు చేపట్టారు. పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, శశి థరూర్ సహా పలువురు కాంగ్రెస్ ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. దేశంలో ద్రవ్యోల్బణం,జీఎస్టీ, నిరుద్యోగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ నిరసనకు పిలుపునివ్వడంతో ఈరోజు ఉదయం నుంచి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు.
ఢిల్లీ పోలీసులు పార్టీ సభ్యులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఢిల్లీ పోలీసులు నిరసన కోసమని కాంగ్రెస్ కు అనుమతి నిరాకరించినప్పటికీ.. న్యూఢిల్లీ జిల్లా ప్రాంతంలో 144 సెక్షన్ విధించినప్పటికీ.. పార్టీ నిరసనను కొనసాగించింది. నిరసన తెలుపుతున్న శాసనసభ్యులను రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు.