5 రాష్ట్రాల ఎన్నికలు 130 ఏళ్ల చరిత్ర కలిగిన జాతీయపార్టీ కాంగ్రెస్ కు తీవ్ర నిరాశను మిగిల్చాయి. హస్తం పార్టీకి ఐదు రాష్ట్రాల ప్రజలు చెయ్యిచ్చేశారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దాదాపు ఆరు దశాబ్దాలు దేశాన్ని ఏలిన పార్టీ క్రమంగా కనుమరుగవుతోంది. ప్రస్తుతం కేవలం రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో మాత్రమే ఆ పార్టీ ప్రభుత్వాలున్నాయి. తాజా ఫలితాల్లో అయితే ఆ పార్టీకి, గాంధీలకు పెట్టని కోటగా ఉన్న అమెథీ, రాయ్ బరేలీలోనూ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. గత లోక్ సభ ఎన్నికల్లోనే అమేధీ ఆపార్టీ చేజారింది. స్వయంగా రాహుల్ గాంధీని అక్కడ మట్టికరిపించారు బీజేపీ నేత స్మృతి ఇరానీ. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం పార్టీ ముఖ్యులు రాహుల్, ప్రియాంక బాగానే శ్రమించారు. వందల ర్యాలీల్లో మెరిశారు. అయినా సరే కనీసం సోదిలో లేకుండా పోయిందాపార్టీ.
400 స్థానాల్లో పార్టీ పోటీ చేస్తే కేవలం 2 స్థానాలకు పరిమితం అయింది. ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలోనూ అదే పరిస్థితి. అధికారంలో ఉన్న పంజాబ్ ను నిలబెట్టుకోలేకపోయింది కాంగ్రెస్. నిలుపుకోవడం అటుంచి పూర్తిగా చతికిలపడింది. సాక్షాత్తూ సీఎం చన్నీ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూసైతం ఘోర పరాజయం పాలయ్యారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)