రాజ్యసభ వేదిగ్గా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. భావ ప్రకటనా స్వేచ్ఛపై లెక్చర్లిచ్చే కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్యాలు అందరికీ తెలుసన్నారు. వీరసావర్కర్ రాసిన కవిత చదివినందుకు లతా మంగేష్కర్ సోదరుడు హృదయ్ నాథ్ మంగేష్కర్ ను ఆలిండియా రేడియో నుంచి ఎలా తొలగించిందో అందరకీ తెలుసన్నారు.
‘వ్యక్తిగత స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ గురించి మాట్వాడే వాళ్ల చరిత్రను నేను చెప్తా. గోవాకు చెందిన లతాజీ కుటుంబం పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన తీరు దేశానికి తెలియాలి. ఆమె తమ్ముడు హృదయనాథ్ ఆలిండియా రేడియోలో వీరసావర్కర్ దేశభక్తిపై రాసిన కవిత చెప్పడమే తప్పంటూ ఉద్యోగం నుంచి తీసేశారు. ఇది మీ భావ ప్రకటనా స్వేచ్ఛ. ఇలాంటివి కాంగ్రెస్ వాళ్ల హయాంలో ఎన్నో జరిగాయి. నెహ్రూను విమర్శించినందుకు మజ్రూహ్ సుల్తాన్‌పురి, ప్రొఫెసర్ ధరంపాల్ ఇద్దరూ జైలు పాలయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో కిషోర్ కుమార్ ఇందిరాగాంధీకి నమస్కరించనందుకు రేడియోలో పాడనివ్వలేదు.” అని మోదీ అన్నారు.