మహారాష్ట్ర ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీకి దేశవ్యాప్తంగా పునరుత్తేజను కల్పించాలి అంటే, ఎన్నికల్లో గెలవాలని భావిస్తోంది. ముఖ్యంగా ముంబై నగరాన్ని దేశానికి వాణిజ్య రాజధానిగా చెబుతారు కాబట్టి మహారాష్ట్రలో గెలిచినట్లయితే పార్టీకి ఆర్థిక వనరులు బాగా బలపడతాయి.
ఈ క్రమంలో మహారాష్ట్ర ఎన్నికల ఖర్చు కోసం కర్ణాటక తెలంగాణ నుంచి నిధులను సమీకరిస్తున్నారు అని తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కర్ణాటక తెలంగాణలలో అధికారం లో ఉంది. దీంతో మహారాష్ట్ర ఎన్నికల కోసం ఇక్కడి నుంచే నిధుల సమీకరణ జరుగుతుంది అని భావిస్తున్నారు. ఆర్థికపరంగా చూస్తే కర్ణాటక కన్నా తెలంగాణయే పచ్చగా కళకళలాడుతున్నదని చెప్పవచ్చు. అక్కడ ఉన్న సీఎం తొలిసారిగా ముఖ్యమంత్రి కావడమే కాక, పార్టీకి పూర్తి విధేయుడుగా ఉన్నందున అక్కడి నుంచి భారీ నిధులను ఆ పార్టీ ఆశిస్తున్నది. అందులో భాగంగానే తెలంగాణలో ఇప్పుడు మూసీ నది పునరుద్ధరణ పేరుతో రూ. 1.5 లక్షల కోట్ల భారీ ప్రాజెక్టుకు తెరతీసారని ఆరోపణలు వస్తున్నాయి.
గతవారం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు ప్రయాణించిన హెలికాఫ్టర్ తెలంగాణాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికార కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నదే కావడం ఇటువంటి అనుమానాలకు మరింతగా బలం చేకూరుస్తుంది. పైగా, వాయనాడ్ లోక్ సభ ఉపఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తుండడంతో అక్కడ ఎన్నికల నిధులు సహితం తెలంగాణ నుండే సమకూర్చనున్నారని భావిస్తున్నారు.
తెలంగాణలో ప్రభుత్వ పరంగా చేపడుతున్న చర్యలు కూడా కొన్ని అనుమానాలు కలిగిస్తున్నాయి. ఇటీవల హైడ్రా పేరుతో రియల్టర్లను బెదిరించడం ప్రారంభమైందని, వారి నుంచి పెద్దమొత్తంలోనే నిధులను సేకరిస్తారని అంటున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది దగ్గరపడుతున్నా ఇస్తామన్న ఆరు గ్యారెంటీలను రేవంత్ ప్రభుత్వం నెరవేర్చలేదు. అభివృద్ధి, సంక్షేమం మాటను పక్కనబెట్టింది.
రైతుల రుణమాఫీ, రైతు భరోసా, పింఛన్ల పెంపు ఎప్పుడో అటకెక్కాయి. అయినప్పటికీ, కొత్త ప్రభుత్వం రూ. 80 వేల కోట్లకు పైగా అప్పులు చేసింది. దీంతో మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఓ ఏటీఎమ్గా వాడుకొంటున్నదా? అనే అనుమానాలను నెటిజన్లు వ్యక్తంచేస్తున్నారు.
మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలుపొందినట్లయితే,, కర్ణాటక తెలంగాణ పక్కపక్కనే ఉంటాయి కాబట్టి మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ పరిపాలన తేలిక అవుతుంది. అంతేకాకుండా నిధుల సమీకరణ కోసం ముంబై బెంగళూరు హైదరాబాద్ నగరాలు కలిసి వస్తాయి. అందుచేత కర్ణాటక తెలంగాణ సరిహద్దులను మూసివేయాలని మహారాష్ట్ర శివసేన చీలిక వర్గం డిమాండ్ చేస్తోంది.