మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో ప్రతిపక్ష పార్టీల్లో అంతర్మథనంనం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఒక మునిగిపోతున్న ఓడ అని గుర్తించారు. అదే ఓడలో
ప్రయాణిస్తే తాము కూడా మునిగిపోతామని ఇతర ప్రతిపక్ష పార్టీలు అంచనా వేస్తున్నాయి.
కూటమిలో కాంగ్రెస్ పార్టీ పార్టీ పరిస్థితి మీద అనుమానాలు వినిపిస్తున్నాయి. మహా నౌకలాంటి కాంగ్రెస్ తమను ఒడ్డుకు చేరుస్తుందని నమ్మామని, అయితే దానికి భారీ చిల్లుపడిందని, ఒడ్డుకు చేర్చడం మాట దేవుడెరుగు నిండా ముంచుతున్నదని ఆ పార్టీలు ఇప్పుడు పునరాలోచనలో పడుతున్నాయి.
మరీ ముఖ్యంగా ఎన్నికల్లో గెలిచే సత్తా లేని రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డును వారు ఇప్పుడు వేలెత్తి చూపుతున్నారు.
మిగిలిన రాష్ర్టాల మాదిరిగా కాకుండా మహారాష్ట్రలో కాంగ్రెస్ దూకుడైన తీరుతో బలమైన వ్యవస్థగా ఉంది. అందుకే ఆ పార్టీ నేతలు ఈ ఎన్నికల్లో తమకు ఎక్కువ సీట్లు కావాలని పట్టుబట్టి మరీ సాధించుకున్నారు.
ఎన్నికలైన తర్వాత మహావికాస్ అఘాడీ అధికారంలోకి వస్తుందని, తామే సీఎం పీఠం చేపడతామంటూ హడావిడి కూడా చేశారు. ఇది కూటమిలోని మిగిలిన పార్టీలకు చికాకు కూడా కలిగించింది. ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు సంబంధం లేని సమస్యలు లేవనెత్తుతూ బీజేపీ పక్షాలపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై కూటమిలోని ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్లు అభ్యంతరం చెప్పారు.
ఇందుకు కొన్ని ఉదాహరణలు చెబుతున్నారు. ముఖ్యంగా వీరసావర్కర్‌పై కాంగ్రెస్ చేసిన విమర్శలు చాలా మంది మనసులను గాయపరిచాయి. దీనిపై రాహుల్‌పై ఒత్తిడి తెచ్చి ఆ విమర్శలను ఆపించినా, అప్పటికే నష్టం జరిగిపోయింది. దానిని బీజేపీ అస్త్రంగా వినియోగించి ఎంవీఏను తీవ్రంగా దెబ్బ తీసింది. అదానీపై రాహుల్ నిత్యం విమర్శలు చేయడంపై కూడా శరద్‌పవార్ అభ్యంతరం చెప్పారు. స్థానిక సమస్యలను ప్రస్తావించకుండా సామాన్యులకు అర్థం కాని అంశాలపై విమర్శలు చేయవద్దని వారు వారించారు. కాంగ్రెస్‌తో వెళ్తేఎన్నికల్లో మునుగుడు ఖాయమని ఇప్పటికే ఆమ్ ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు నిశ్చయాభిప్రాయంతో ఉన్నాయని, అది గ్రహించక తాము దానితో వెళ్లి మునిగామని పలువురు ఎంవీఏ నేతలు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ తెలివిగా ఈ ఓటమిని మిత్రపక్షాల మీదకి నెట్టేస్తోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ఘోర ఓటమిపై ఆ పార్టీలు నిందించుకుంటున్నాయి. ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు ఒకరికొకరు సహకరించుకోలేదని కర్ణాటక హోం మంత్రి, కాంగ్రెస్ ఎన్నికల ఇంచార్జ్ జీ పరమేశ్వర్ ఆరోపించారు. ఇబ్బందికరమైన ఓటమికి కారణం కూటమి భాగస్వాముల మధ్య సహకారం, సమన్వయం లేకపోవడమేనని విమర్శించారు.
మొత్తం మీద రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి కొన్ని పార్టీలు గుడ్ బై చెప్పే అవకాశం కనిపిస్తున్నది.