ఎన్నికలద్వారా ప్రభుత్వాలనుమార్చుకోవచ్చునని ప్రజానీకానికి విశ్వాసం కలిగింంచటంలో 1967 ఎన్నికలు కీలకమైనవి. ఆ ఎన్నికలు సమీపించుతున్న తరుణంలో దీనదయాళ్ ఉపాధ్యాయ కార్యకర్తలు ఏమిచేయాలో, ఎందుకుచేయాలో, ఎలాచేయాలో స్పష్టంగా మార్గదర్శన మందించారు.
ఎన్నికల ప్రణాళిక ఇలా మొదలైంది: “మన చరిత్రలో నూతనాధ్యాయాన్ని ప్రారంభించాలని భారత ప్రజానీకం ఆకాంక్షిస్తున్నారు. రాబోతున్న ఎన్నికలు చక్కటి అవకాశమిస్తున్నవి. గత ఇరవై సంవత్సరాలు గా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజల విశ్వాసం పదిల పరుచుకోగల పనులేవీ చేయలేదు. ప్రజల శక్తి సామర్ధ్యాల అభివ్యక్తీకరణకు ప్రభుత్వం ఏనాడూ యత్నించనేలేదు. ప్రజలలో ఉన్న సాహసం గాని, మన సైనిక దళాలు చేస్తున్న త్యాగం గాని ప్రభుత్వ విధానాలలో ప్రతిబింబించటం లేదు. ఈ దేశ మౌలిక మైన ఏకత్వాన్ని, ప్రజల ఆశయ ఆకాంక్షలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకొనటం లేదు. సమృద్ధి స్వావలంబన, గౌరవములతోకూడిన ప్రజాజీవితాన్ని వికసింప జేయడానికి బదులుగా కాంగ్రెసు దేశాన్ని దివాళా తీసే స్థితికి దిగజార్చివేసింది.రాజకీయంగా బానిసతనాన్ని,అంతర్జాతీయంగా అవమానాలనూ మనం ఎదుర్కోవలసి వస్తున్నది. ‘స్వదేశీ’ ‘స్వధర్మ’ ‘స్వాతంత్ర్య’ అనే ఉదాత్త లక్ష్యాలను గొంతు నులిమి వేయడాన్ని ప్రజానీకం ఇంక ఏమాత్రం సహించబోరని, కాంగ్రెసుకు అధికారం ఇవ్వబోరని గ్రహించాలి.మార్పు అనివార్యంగా రాబోతున్నది.”
వాస్తవ పరిస్థితులను సూక్ష్మంగా అవలోకించి, అంచనా వేసుకొని తదనుగుణంగా ఒక దూకు దూకడానికి దీనదయాళ్ జీ యోజన చేసేవారు. ఆయన లోని నాయకత్వ ప్రతిభకు అది నిదర్శనం. కాంగ్రెసును అధికారంనుండి తొలగించాలని ప్రగాఢంగా ఆశించటమే కాదు, అది జరుగ బోతున్న దని గట్టి నమ్మకం ఆయనకు కలిగింది. అది భారతీయ జనసంఘ్ ఎన్నికల ప్రణాళికలో ప్రతిబింబించింది.
“ప్రజలకు ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పక్షం కావాలి. కచ్చితమైన సిద్ధాంత భూమిక, నిర్దిష్ట మైన విధానాలు, స్పష్టమైన కార్యక్రమమూ ఉన్న పార్టీయే ప్రత్యామ్నాయం కాగల్గుతుంది. అటువంటి పార్టీయొక్క వేళ్లు ఈ భూమిలోనే పాతుకొని ఉండాలి. దేశవ్యాప్తంగా దాని శాఖలు విస్తరించి ఉండాలి. క్రమ శిక్షణ, అంకిత భావమూ ఉన్న కార్యకర్తల గణాలూ ఉండాలి. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు ఆచరణీయమైన పరిష్కారాలను ఆ పార్టీ సూచించ గలగాలి. ఆదర్శాలను ఎన్నడూ విడిచిపెట్టని దృఢదీక్షతో కూడిన వ్యవహారశైలి ఉండాలి. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి జన సంఘ్ సిద్ధమై రంగంలో నిలిచింది. ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న కారణంగానే ప్రజల సహకారం జన సంఘానికి లభించింది.
“సంఘర్షభరితంగా ఉన్న ఈ సంధికాలంలో ప్రజానీకం జనసంఘ్ పట్ల ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఈ విషయం జనసంఘ్ గ్రహించుకొంది. ప్రజలు తమ మీద ఉంచుతున్న విశ్వాసాన్ని, దానితోపాటు ఉండే బరువు బాధ్యతలనూ భుజాలకెత్తుకొనే అమోఘ మైన సంకల్ప బలంతో జనసంఘ్ ఈ ఎన్నికలను ఎదుర్కొంటున్నది.”
మాటలలో పొదుపును, సంయమనాన్ని పాటించటం దీనదయాళ్ జీలోని ఒక విశిష్ట స్వభావం. ఆయన పలికిన కొద్దిపాటి మాటలు అర్థవంతంగాను, భావ గర్భితంగానూ ఉండేవి. 1967 ఎన్నికల ప్రణాళిక ఆయన లోని సుదూర భవిష్యత్తు లోకి చూడగల దూరదృష్టిని ప్రతిబింబించింది. ఆ ఎన్నికల ప్రణాళిక లో ఎక్కడా ప్రగల్భాలు గాని, ఆచరణకు అందని వాగ్దానాలు గాని మచ్చుకైనాలేవు.
ఎన్నికల ప్రణాళికతోపాటు ‘జాతీయ ప్రజాస్వామిక ప్రత్యామ్నాయం’ అన్న విషయమై ఒక తీర్మానాన్ని కూడా జనసంఘ్ ఆమోదించి ప్రజలముందు పెట్టింది. కాంగ్రెసును ఓడించే వ్యూహరచన ఎలాఉండాలో తెలియ జెప్పడానికి చక్కటి ఉదాహరణ ఈ తీర్మానం. “కాంగ్రెసును త్రోసిపారవేయడానికి ప్రజలలో ఉన్న ఆరాటాన్ని మనం గమనించుకోవాలి. అయితే అది కార్యరూపానికి రావటమనేది అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయాన్నిబట్టి ఉంటుంది. జనసంఘం ఎంత సన్నద్ధమై ఉంది అన్న అంశంమీదా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఉత్తర ప్రదేశ్,మధ్య ప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లలో అన్ని స్థానాలకూ జనసంఘ్ పోటీ చేయవలసిఉంది. ఇతర ప్రాంతాల్లో గత అయిదు సంవత్సరాలుగా జనసంఘ్ క్రియా శీలంగా ఉండి కాంగ్రెసును సవాలుచేయగల సత్తా ఉన్న అన్ని నియోజకవర్గాల లోనూ జనసంఘ్ పోటీ చేయవలసిందే.
“జాతీయ, ప్రజాస్వామిక ప్రభుత్వాలను ఏర్పరచ గలమని ఇతర పార్టీలు ఆశించుచున్న చోట్ల వారితో జనసంఘ్ సహకరిస్తుంది. అదే మాదిరిగా జనసంఘ్ ప్రభుత్వం ఏర్పరచగలిగేచోట్ల ఇతరపార్టీలనుండి సహకారం లభించాలనీ ఆశిస్తూ ఉంది.”
ఎన్నికలు మరో మూడు నెలల్లో జరుగుతా యనగా, ప్రభుత్వాన్ని ఏర్పరచటంలో ఉండే సాధకబాధకాలకు జనసంఘ్ మానసికంగా తయారైంది. ఆ సంసిద్ధతను ఆయన ఇలా వ్యక్తపరిచారు. “ప్రతిపక్ష పార్టీలు తమలో తాము క్రుమ్ములాడుకొనడాన్ని పరిహరించ టంకోసం స్థానికమైన సర్దుబాట్లకు అనుమతిస్తు న్నాము. జనసంఘ్ తో ఏ విధమైన సారూప్యతా లేని కమ్యూనిస్టులతో మాత్రం ఏవిధమైన సర్దుబాట్లూ ఉండవు.”
నాల్గవ సాధారణ ఎన్నికలు ముగిశాయి. దీనదయాళ్ జీ అంచనాలు నిజమయ్యాయి. కాంగ్రెసు ఘోరంగా ఓడిపోయింది. డిల్లీ ప్రాంతంలోను, ఎనిమిది రాష్ట్రాల లోనూ కాంగ్రెసు మట్టికరిచింది. జనసంఘ్ ఏవిధమైన ఎన్నికల ఒప్పందం చేసుకొనకుండా, తనంత తానుగా పోటేచేసి, మరి ఏ ఇతర పార్టీకి సాధ్యంకాని పురోగతి సాధించింది. 1962లో లోకసభలో 14 స్థానాలను, వివిధ రాష్ట్రాల శాసనసభల్లో 116 స్థానాలను మాత్రమే జనసంఘ్ గెల్చుకొంది. అప్పుడు పొందిన వోట్లసంఖ్య 63,70,893.
1967 లోగెల్చుకొన్న లోకసభస్థానాలు 35. శాసనసభ స్థానాలు 268. పొందిన వోట్ల సంఖ్య 1,25,67,918. ఇదే సమయంలో కాంగ్రెసు గెలిచిన శాసనసభ స్థానాల సంఖ్య 2246 నుండి 1692కి పడిపోయింది. 9 రాష్ట్రాల్లో కాంగ్రెసు ఆధిక్యతను కోల్పోయింది.
ప్రభుత్వాలు ఏర్పరిచే విషయమై దీనదయాళ్ జీ ఇలా అన్నారు: డిల్లీలో జనసంఘ్, తమిళనాడులో డి.ఎం.కె స్వతంత్రంగా ప్రభుత్వాల నేర్పరచగల స్థాయి సాధించాయి. మిగిలిన చోట్ల మిశ్రమ ప్రభుత్వాలు ఏర్పడని పక్షంలో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెసు పార్టీని ప్రభుత్వం ఏర్పరచవలసిందిగా ఆహ్వానిస్తారు. అంటే కాంగ్రెసును తిరస్కరిస్తూ ప్రజ లిచ్చిన తీర్పును వమ్ముచేసి నట్లవుతుంది. దాని వల్ల ప్రజాస్వామికంగా విప్లవం సాధ్యమేనన్న నమ్మకమే చెదిరిపోతుంది.”
తదనుగుణంగా జనసంఘ్ కేంద్రకార్యకారిణి ఒక నిర్దేశాన్ని జారీచేసింది. జనసంఘ్ సిద్ధాంతాలకు, కార్యక్రమాలకు అనుగుణంగా సేవలందించ గలిగి నంత వరకే జనసంఘ్ సభ్యులు మంత్రివర్గాల లో కొనసాగుతారు. జనసంఘ్ శాసనసభా పక్షం తన ప్రత్యేక అస్తిత్వాన్ని నిలబెట్టుకొంటూనే ఉంటుంది.
జనసంఘ్ కి చెందిన ప్రతినిధులందరూఏప్రియల్ డిల్లీలో సమావేశమైనపుడు దీనదయాళ్ జీ ఇలా వివరించారు. జనసంఘ్ మిశ్రమ మంత్రి వర్గాలలో భాగస్వామి అవుతుంది. అయితే రాబోయే ఎన్నికల్లో ఇతరులతో కలిసి ఎటువంటి ఐక్య సంఘటననూ ఏర్పాటు చేయబోదు. జరిగిన ఎన్నికల్లో గనుక ఇతరులతో కలిసి కూటమి ఏర్పరిచి ఉంటే జనసంఘ్ కి ఇన్నిస్థానాలు వచ్చి ఉండేవి కావు. అవసరమైన చోట జనసంఘ్ స్థానిక సర్దుబాట్లుచేసికొని ఉండక పోతే, అటువంటి చాలాచోట్ల కాంగ్రెసు గెలిచి ఉండేది. కాంగ్రెసు బలం మరింత ఎక్కువగా కన బడేది. మిశ్రమ మంత్రి వర్గాలను ఏర్పరిచే విషయం లో జనసంఘ్ చొరవచూపియుండని పక్షంలో కాంగ్రెసు ప్రభుత్వాలు ప్రమాణస్వీకారం చేసి ఉండేవి. కమ్యూనిస్టుల ఆదర్శాలు మన ఆదర్శాలకు విభిన్నం గా, విరుద్ధంగా ఉన్నప్పటికీ మంత్రివర్గంలో చేరువ కావటం అనివార్యమైంది.
అప్పుడు జరిగిన చర్చలో- ఎన్నికల ముందు కూటమిని ఏర్పరచకుండా ఉన్న పద్ధతిని కొన సాగిస్తూ, మిశ్రమ మంత్రివర్గాలలో చేరకుండా దూరంగా ఉండిపోవాలని వాదించినవారు లేక పోలేదు. అయితే, ఆ రెండింటిమధ్యగల తేడాను దీనదయాళ్ జీ ఎత్తిచూపించారు. ఐక్య సంఘటన లేదా కూటమి ఉన్నట్లయితే, భాగస్వామ్యపక్షాలపట్ల వ్యతిరేకత కారణంగా జనసంఘ్ చాలా నష్టపోయి ఉండేది. మిశ్రమ మంత్రి వర్గాలు- సంయుక్త విధాయక్ దళ్ ప్రభుత్వాలు ఏర్పరిచే సందర్భంలో దానికి ఆధారం కనీస కార్యక్రమం మాత్రమే. తద్వారా కాంగ్రెసును అధికారంలోకి చొరబడకుండా నిరోధించ గల్గటం సాధ్యమౌతుంది. ఇది సంధికాలంలో, తాత్కాలిక మైనదే అయినా, చాలా విలువైన ఉపలబ్ది.
(‘దేశహితమే ప్రధానం’- నవయుగభారతి ప్రచురించిన గ్రంథం నుండి)