హైదరాబాదు మెట్రో ట్రైన్ పూర్తిగా విజయవంతమైంది . రద్దీగా ఉండే ఎల్బీనగర్ నుంచి మియాపూర్ దాకా నాగోల్ నుంచి రాయదుర్గం వరకు మెట్రో రైలు నడుస్తున్నాయి ఈ రెండు మార్గాల్లోనూ బస్సు ప్రయాణాలు విపరీతమైన రద్దీగా ఉంటాయి. మెట్రో వచ్చాక మెట్రో రైలు కూడా కిటకిటలాడుతూ సాగుతున్నాయి. మూడో దశగా జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఫలక్ నుమా దాకా విజయవంతంగా మెట్రో రైల్ నడుస్తోంది.
కానీ నాలుగో దశ మెట్రో రైల్ మీద ఇప్పుడు వివాదం నడుస్తోంది. ప్రజలు విపరీతంగా ఇష్టపడే మార్గాన్ని ప్రభుత్వం వదిలేసింది అన్న మాట వినిపిస్తోంది.
శాస్త్రీయంగా ట్రాఫిక్‌ను అధ్యయనం చేసి అత్యంత యోగ్యమైన మెట్రో రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో మార్గాన్ని గుర్తించారు. రాయదుర్గం నుంచి నానక్ రామ్ గూడా, మణి కొండ, నార్సింగి, రాజేంద్ర నగర్, శంషాబాద్ మీదుగా విమానాశ్రయం దగ్గరికి మెట్రో రైలు చేరుకుంటుంది.
ఈ మార్గాన్ని నిర్మించేందుకు గత ప్రభుత్వం డీపీఆర్ రూపకల్పనతో పాటు క్షేత్ర స్థాయిలో పనులు పూర్తి చేసింది.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ ఎయిర్‌పోర్టు మెట్రోను రద్దు చేసింది. దాని స్థానంలో నాగోల్ నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు, మరో మార్గాన్ని మైలార్‌దేవ్‌పల్లి, ఆరాంఘర్ మీదుగా కొత్త హైకోర్టు వరకు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది.
ఈ ప్రాంతంలో బస్సు రవాణా కే సరైన ఆదరణ ఉండటం లేదు. అటువంటి అప్పుడు మెట్రో ప్రయాణం ఎంతవరకు ఇష్టపడతారు అనేది ప్రశ్న. గత ప్రభుత్వం ఫార్మాసిటీకి ఉన్న భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎయిర్‌పోర్టు వరకు వచ్చిన మెట్రో మార్గాన్ని పొడిగిస్తూ..హైదరాబాద్-శ్రీశైలం హైవేపై తుక్కుగూడ మీదుగా మహేశ్వరం, కందుకూరు వరకు మెట్రో మార్గాన్ని మూడో దశలో నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల మీదుగా గత ప్రభుత్వం మెట్రో ప్రతిపాదనలు చేస్తే, వాటిని పూర్తిగా పక్కన పెట్టి..కొత్త మెట్రో మార్గాలను అష్ట వంకర్లు తిప్పుతూ.. ఫోర్త్ సిటీ వరకు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తాజాగా ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
పైగా ఈ కొత్త మార్గంలో భూ సేకరణ కూడా సంక్లిష్టంగా కనిపిస్తోంది. కొత్తగా నిర్మిస్తున్న హైకోర్టు నుంచి ఎయిర్‌పోర్టు లోపలి నుంచి తుక్కుగూడ, కొంగరకలాన్ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ మీదుగా ఫోర్త్ సిటీగా చెబుతున్న ప్రాంతానికి ప్రతిపాదిస్తున్న మెట్రో మార్గంలో.. రద్దీ లేని ప్రాంతాలే ఉన్నాయి. ముఖ్యంగా కొంగరకలాన్ నుంచి 18 కి.మీ మేర ఫోర్త్ సిటీ వరకు ప్రతిపాదిస్తున్న మార్గంలో చాలావరకు జనావాసాలు లేవు. దీంతో మెట్రో రైలు ఖాళీగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.
మొత్తం మీద గత ప్రభుత్వంతో ఉన్న విభేదాలతో ప్రస్తుత ప్రభుత్వము ఈ కొత్త ప్రాజెక్టుని తలకు ఎత్తుకుంది అన్న మాట బలంగా వినిపిస్తోంది. కానీ పంతాలు పట్టింపుల మధ్య హైదరాబాద్ ప్రజలు నలిగిపోతున్నారనేది అంతే సత్యం.