జాతీయ విద్యా విధానంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, వ్యవస్థలకు ఎంతో మేలు ఉంటుందని విద్యాభారతి అఖిల భారతీయ ప్రచార ప్రభారీ లింగం సుధాకర్ రెడ్డి వెల్లడించారు. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం ద్వారా విద్యార్థి సర్వాంగీణ వికాసం చెందడమే కాకుండా జాతీయ నిష్ఠ అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. జాతీయ నిష్ఠ, దేశభక్తి, జాతీయ భావాలు జాతీయ విద్యా విధానం వల్ల సాధ్యమవుతుందన్నారు. శ్రీ సరస్వతీ విద్యా పీఠం విద్వత్ పరిషత్ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో విద్వత్ సదస్సు జరిగింది. ఈ విద్వత్ సదస్సులో లింగం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశభక్తి, హిందుత్వ నిష్ఠ, జాతీయ భావాలు పెంపొందడం వల్ల వ్యక్తి సమాజంలో ఆదర్శవంతుడిగా నిలుస్తాడని, దేశానికి కూడా లాభం చేకూరుతుందన్నారు. దీంతో భారత్ ప్రపంచానికి మార్గదర్శకత్వం వహించే స్థాయికి చేరుకుంటుందని తెలిపారు.
విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్రం అధ్యక్షులు, రిటైర్డ్ ఐఏఎస్ చామర్తి ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానంతో విద్యార్థిలో సకారాత్మక మార్పులు సంభవిస్తాయన్నారు. మన చరిత్ర నేటి విద్యార్థులకు, యువత తెలుసుకోవాల్సిన అవసరం వుందన్నారు. జాతీయ విద్యా విధానం ద్వారా దేశ పునాదులేమిటో తెలిసి వస్తుందన్నారు. భారతీయ పరంపర చాలా గొప్పదని, ప్రస్తుతం కొనసాగుతున్న విద్యా విధానాన్ని మార్పు చేసి, భారత కేంద్రిత విద్యా విధానం అమల్లోకి తేవాలన్నారు. ప్రపంచంలో జరిగిన వివిధ ఆవిష్కరణలో భారత్ అగ్ర స్థానంలో వుండేదని పేర్కొన్నారు. మన దేశంలోని తక్షశిల నలంద విశ్వ విద్యాలయం ఎన్నో విజయాలను సొంతం చేసుకుందని గుర్తు చేశారు. జాతీయ విద్యా విధానంతోనే సమాజంపై ఓ స్పష్టత వస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో అనేక మంది ఆచార్యులు, స్తానిక పెద్దలు పాల్గొన్నారు.