స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేత పార్థ ఛటర్జీని బెంగాల్ మంత్రివర్గం నుంచి తొలగించారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఛటర్జీని పార్టీ, అలాగే మంత్రివర్గంలోని అన్ని పదవుల నుంచి తొలగించాలని పెరుగుతున్న వాదనల మధ్య ఈ సమావేశం జరిగింది.
రాష్ట్ర కేబినెట్లోని కామర్స్ అండ్ ఇండస్ట్రీ, పార్లమెంటరీ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ సహా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ పోర్ట్‌ఫోలియోల నుంచి ఆయనను తొలగించారు. నిన్న TMC ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ పార్థ ఛటర్జీని పార్టీ నుంచి, అలాగే మంత్రివర్గం నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
“నా పార్టీ అవినీతి పట్ల చాలా కఠినంగా వ్యవహరించే పార్టీ కాబట్టి నేను అతనిని మంత్రివర్గం నుంచి తొలగించాను. దీనిని చూపిస్తూ TMC పై ప్రజల్లో ఉన్న మంచి అవగాహనను మార్చగలరని ఎవరైనా అనుకుంటే, వారు తప్పుగా భావిస్తున్నట్టే” అని మమతా బెనర్జీ అన్నారు.
ఛటర్జీని తొలగించిన తర్వాత మమతా కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించారు.